విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నిక రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తరువాత ఈ ఎన్నికలో గెలవాలని పట్టుదలతో ఉంది. స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఈ ఎన్నికలో వైసీపీకి పూర్తి స్థాయి సంఖ్యా బలం ఉంది.
టీడీపీ కూటమి గెలుపు అవకాశం వైసీపీకి ఇవ్వకూడదని భావిస్తోంది. ఈ సమయంలోనే బొత్సా ను అభ్యర్దిగా ఎంపిక చేసిన జగన్ ఈ ఎన్నికలో గెలిచి వస్తే కీలక పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం.
బరిలో బొత్సా :
విజయనగరం జిల్లాకు చెందిన నేత అయినా..వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్దిగా బొత్సా ఖరారు కావటంతో కూటమిలో చర్చ మొదలైంది. ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావటంతో కోడ్ అమల్లోకి వచ్చింది. బొత్స సత్యనారాయణపై టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి పోటీచేసే అభ్యర్థి ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. కూటమి నుంచి రేసులో పీలా గోవింద్, గండి బాబ్జీ, పీవీజీ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనకాపల్లి జిల్లా నేతలతో ఆ నియోజకవర్గం ఎంపీ సీఎం రమేశ్ భేటీ అయ్యారు.
జగన్ నిర్ణయం వెనుక :
బొత్సా ఎంపిక పైన జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకి 615 ఓట్లు ఉన్నాయి. మొత్తం 841 ఓట్లకు గాను వైసీపీకి 75 శాతం బలం ఉండగా, అధికార కూటమికి కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఎన్నికల ముందు… ఆ తర్వాత కొందరు వైసీపీ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఎన్నిక ముందు ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు కూటమి నేతలు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. దీంతో, జగన్ అప్రమత్తం అయ్యారు.
బొత్సాకు రాజకీయంగా, ఆర్దికంగా ఉన్న బలంతో ఈ ఎన్నిక గెలవాలనేది జగన్ లక్ష్యం. ఇదే సమయంలో మరో ఆఫర్ ఇచ్చారు. బొత్సా ఎమ్మెల్సీగా గెలిస్తే మూడున్నారేళ్లు ఎమ్మెల్సీగా ఉండనున్నారు. గెలిస్తే బొత్సాకు శాసనమండలిలొ ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. వైసీపీకి మండలిలో మెజారిటీ ఉంది. ప్రస్తుతం ఆ పార్టీకి లేళ్ల అప్పిరెడ్డి అపోజిషన్ లీడర్ గా ఉన్నారు. బొత్స గెలిస్తే ఆయనకే ఆ పదవి కట్టబెట్టనున్నారు. బొత్స శాసనమండలిలో ఉంటే టీడీపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తారు అని జగన్ అంచనాగా ఉంది.