చంద్రబాబు, రేవంత్ భేటీలో జరిగిందిదే: తెలంగాణ, ఏపీ మంత్రులు.

ప్రజా భవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ ముగిసిన అనంతరం వివరాలను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాకు వెల్లడించారు. కమిటీల ద్వారా విభజన సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలపై సమావేశంలో మాట్లాడుకున్నామని తెలిపారు.

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూలంకషంగా చర్చించిన అనంతరం ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ వేయాలని నిర్ణయించినట్లు భట్టి తెలిపారు. సీఎస్ లు, ముగ్గురు అధికారులతో రెండు వారాల్లోగా కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వీరి స్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై మంత్రులతో మరో కమిటీని వేయాలని తీర్మానించినట్లు వెల్లడించారు.

అక్కడ కూడా పరిష్కార మార్గం లభించని అంశాలుంటే సీఎంల స్థాయిలో పరిష్కార మార్గం కనుగొనాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి రెండు తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించామని భట్టి విక్రమార్క తెలిపారు. విభజన సమస్యల పరిష్కారానికే కమిటీలు వేశామని చె.ప్పారు. రెండురాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు సమావేశంలో నిర్ణయించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్తెలిపారు.

సుమారు రెండుగంటల పాటు జరిగిన భేటీలో ప్రధానంగా షెడ్యూల్‌-9, 10లోని సంస్థల ఆస్తుల పంపిణీపై చర్చించినట్లు వివరించారు. ఆ తర్వాత ఏపీ మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ.. తెలుగుజాతి హర్షించే రోజు అని వ్యాఖ్యానించారు. విభజన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు సీఎంలు ముందుకు రావడం శుభపరిణామమని తెలిపారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ఏపీలోనూ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సత్యప్రసాద్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these