వైసీపీలో అంతర్గత సంక్షోభం రోజు రోజుకూ తీవ్ర మౌతోంది. ఆ పార్టీలో ఎమ్మెల్యేలెవరూ సంతృప్తిగా లేరనీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ కన్ఫర్మ్ కాదన్న ఆందోళన దాదాపుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలలో ఉందనీ గత కొంత కాలంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జగన్ సమీప బంధువు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని పార్టీ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసే విషయంలో ఎలాంటి సంకోచాలూ మొహమాటాలూ లేకుండా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఇంకా పలువురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొడుతూ తమ అసమ్మతిని తెలియజేస్తూనే ఉన్నారు. నేడో రేపో వారంతా పార్టీకి షాక్ ఇవ్వడం ఖాయమని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతూనే ఉంది. ఇహ ఇప్పుడు వైసీపీలో అసంతృప్తి నిజమే. ఎమ్మెల్యేల వలస ఎంతో దూరంలో లేదు అన్న స్పష్టత వచ్చేసింది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికీ, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. గత కొద్ది కాలంగా పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తనకు పార్టీ టికెట్ లభించదన్న నిర్ధారణకు వచ్చేసిన ఆళ్ల ఏ మాత్రం ఉపేక్షించకుండా పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసేశారు. ఎమ్మెల్యే పదవికి తన రాజీనామాను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. స్పీకర్ ఫార్మాట్ లోనే ఆళ్ల ఆ రాజీనామా లేఖ అందించేసినట్లు చెబుతున్నారు. అలాగే పార్టీకి కూడా రాజీనామా చేసేశారు. మంగళగిరి వైసీపీ ఇన్ చార్జిగా గంజి చిరంజీవిని నియమించనుండటం, ఆ గంజి చిరంజీవి ఆదివారం (డిసెంబర్ 10) మంగళగిరిలో ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంతో ఇక పార్టీలో కొనసాగి ప్రయోజనం లేదన్న భావనకు వచ్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. గత ఎన్నికలలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేష్ పై విజయం సాధించి జెయంట్ కిల్లర్ గా సంచలనం సృష్టించారు.అప్పట్లోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంత్రి పదవిని ఆశించారు. అయితే జగన్ ఎన్నికలకు ముందు లోకేష్ ను ఓడిస్తే మంత్రి పదవి ఇస్తానని ఇచ్చిన హామీని విస్మరించి తొలి క్యాబినెట్ లో కానీ, ఆ తరువాత పునర్వ్యవస్థీకరణలో కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డికి అవకాశం ఇవ్వలేదు. దీంతో ఒకింత అసంతృప్తితో ఉన్న ఆయన ఇప్పుడు ఇక వచ్చే ఎన్నికలలో టికెట్ కూడా హుళక్కే అని తేలడంతో రాజీనామా చేశారు. వైసీపీ ఇన్ ఛార్జిగా గంజి చిరంజీవిని నియమిస్తుండడంతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. నిన్న (ఆదివారం) గంజి చిరంజీవి ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆర్కే ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు.
