చంద్రబాబు ఎన్నాళ్ళు ఇలా…? తెలుగుదేశం పార్టీకి సర్వం ఆయనే…

చంద్రబాబు మధ్యంతర బెయిల్ మీద ఇపుడు హైదరాబాద్ లోని తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయనకు బెయిల్ దక్కింది హెల్త్ కండిషన్ల మీద. అందుకే ఆయన కంటికి ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మీద హై కోర్టులో విచారణ సందర్భంగా ఆయన తరఫున న్యాయవాదులు సమర్పించిన హెల్త్ రిపోర్టులు చూస్తే బాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది అంటున్నారు. బాబుకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని అంటున్నారు. ఆయన ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉందని కూడా అంటున్నారు. దాంతో బాబుకు ఈ నెల 28 వరకూ ఉన్న మధ్యంతర బెయిల్ ని మరి కొన్నాళ్ళు పొడిగించాలని కచ్చితంగా ఆయన న్యాయవాదులు కోరుతారు. కోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు.

అయితే బాబుకు బెయిల్ రూపంలో మరింత గడువు పొడిగించినా రిలీఫ్ దొరికినా ఉపయోగం ఏమిటి అన్న చర్చ వస్తోంది. నిజానికి టీడీపీలో చంద్రబాబు ఒక్కరే పని రాక్షసుడు అని చెప్పాలి. ఆయన తాను పని చేస్తూ పార్టీని మొత్తం పని చేయించేవారు. అలాంటి బాబు ఇపుడు జైలులో ఉన్నా బయట ఉన్నా ఒక్కటే అన్న మాట అయితే ఉంది. ఆయన మునుపటి మాదిరిగా పార్టీ ఆఫీసుకు వచ్చి పార్టీని కదిలించాలి. అలాగే జనాలలో ఉంటూ ఆయన ప్రచారం చేయాలి. సభలు సమావేశాలు పెట్టాలి. అపుడు కదా టీడీపీకి కొత్త ఊపు వచ్చేది అని అంటున్నారు. బాబుకు మధ్యంతర బెయిల్ ఇస్తూ కోర్టు కొన్ని కండిషన్లు పెట్టింది. ఆయన ఏ రకమైన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనరాదు మీడియాతో మాట్లాడరాదు అని షరతులు విధించింది. మరి బాబు అలా మౌనంగా ఉంటూ రెస్ట్ తీసుకుంటే పార్టీ పరుగులు తీసేది ఎలా అన్న డౌట్లు అయితే తమ్ముళ్ళకు వస్తున్నాయి. బాబు ఇదివరకులా బయటకు వచ్చి తిరగాలంటే ఆయనకు రెగ్యులర్ బెయిల్ రావాలి. అలాగే ఆయన సుప్రీం కోర్టులో పెట్టుకున్న క్వాష్ పిటిషన్ మీద అనుకూలంగా ఏమైనా తీర్పు రావాలి.

ఇవి జరగకపోతే మాత్రం బాబు ఇంట్లో ఉన్నా కూడా టీడీపీకి జోష్ అయితే రాదు. బాబు తరఫున న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కోసం ప్రయత్నిస్తున్నారు. తమ వాదనలు వినిపిస్తున్నారు. క్వాష్ పిటిషన్ లో అయితే ఇప్పటికే వాదనలు పూర్తి అయ్యాయి. తీర్పు రిజర్వులో ఉంది. ఇలా బాబుతో పాటు తమ్ముళ్ళు ఆశగా ఏమి జరుగుతుందో ఎదురుచూడాల్సిన పరిస్థితులే ఉన్నాయి. బాబు జైలులు వెళ్ళి 52 రోజులు ఉండి బయటకు వచ్చారు. బాబు జైలులో ఉంటే ఆయన అక్కడ ఉన్నారు వైసీపీ ఇరికించింది, అక్రమంగా అరెస్ట్ చేయించింది అని టీడీపీ నేతలు అందోళన చేసేవారు. ఇపుడు ఆ చాన్స్ కూడా లేదు. బాబు ఇంట్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మీద ఏమీ అనలేని పరిస్థితి. కేవలం న్యాయ స్థానాల వైపు చూడడమే.

మరో వైపు బాబు బెయిల్ కోసం ఆయనకు ఉన్న రోగాలు అన్నీ బయటపెడుతున్నారు న్యాయవాదులు. దీంతో బాబు ఫిట్ నెస్ గురించి ఆయన దూకుడు రాజకీయం గురించి కూడా జనంలో చర్చ సాగుతోంది. బాబు వయోభారం అనారోగ్యం వంటివి జనంలో చర్చగా వెళ్తూంటే దానివల్ల పాజిటివ్ రియాక్షన్ ఎంతవరకూ వస్తుందో తెలియదు కానీ ప్రత్యర్ధులకు మాత్రం ఆయుధాలు అవుతాయని భయపడుతున్న వారూ ఉన్నారు. బాబుకు రెస్ట్ అవసరమే అని వైసీపీ నేతలు అంటున్న నేపధ్యం ఉంది. మొత్తానికి బాబు బయట ఉన్నారు అన్న మాటే కానీ టీడీపీకి ఏము లాభం అన్నదే ఇపుడు తమ్ముళ్ళను వేధిస్తున్న ప్రశ్న.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these