విజయవాడ వేదికగా జరుగుతున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల సభలో నాలుగు కీలక కార్యక్రమాలను ఆ పార్టీ ప్రకటించింది. జగనన్న ఆరోగ్య సురక్ష, వై ఏపీ నీడ్స్ జగన్, బస్సు యాత్ర, ఆడుదాం ఆంధ్రా పేరుతో నాలుగు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు.ప్రతి సచివాలయ పరిధిలోని ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల దగ్గరకు వెళ్లే విధంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది వైసీపీ. మొదటి దశలో సచివాలయ పరిధిలోని లబ్ధిదారుల జాబితా ప్రదర్శించనున్నారు. రెండో దశలో పార్టీ జెండాల ఆవిష్కరణ, మూడో దశలో ఇంటింటి సందర్శన, టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల పని తీరును పోలిస్తూ వివరించడం చేయనున్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఇక బస్సు యాత్ర కూడా చేపట్టబోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చేసిన అభివృద్ధి పనులను వెల్లడించడానికి బస్సు యాత్రను ఉపయోగించుకోనున్నారు. మూడు నెలల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగించనున్నారు. మరోవైపు ఆడుదాం ఆంధ్రా పేరుతో సచివాలయ, మండల, జిల్లా స్థాయిల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తారు. జనవరి 17వ తేదీ వరకు ఆడుదాం ఆంధ్రా కింద క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఇక నాలుగున్నర ఏళ్లుగా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే విధంగా ఈ కార్యక్రమం ఉండనుంది. సీఎం జగన్ స్వయంగా సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేసేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సన్నద్ధమయ్యారు. అందులో భాగంగా పార్టీ ప్రతినిధుల సభలో దిశా నిర్దేశం చేస్తున్నారు.
