స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు శనివారం అరెస్ట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. చంద్రబాబుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
చంద్రబాబుకు బెయిల్ కోసం టీడీపీ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దేశంలోనే ప్రముఖ లాయర్ సిద్దార్థ్ లూథ్రా చంద్రబాబు కేసును వాదిస్తున్నారు.రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు తన మొదటి రోజు చాలా ప్రశాంతంగా గడిపినట్టుగా సమాచారం అందుతుంది. ఆదివారం రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన చంద్రబాబు మొదట కొంత ఇబ్బందికి గురైనా తరువాత జైలు జీవితానికి అలవాటు పడినట్టుగా తెలుస్తుంది. సోమవారం తెల్లవారు జామున 5 గంటలకే నిద్రలేచిన చంద్రబాబు తన కార్యక్రమాలను ప్రారంభించినట్లు జైలు అధికారులు వెల్లడించారు.ఐదుగురు భద్రత సిబ్బందితో కలిసి ఆయన వాకింగ్ చేసినట్టు చెబుతున్నారు. అరగంట సేపు వాకింగ్ చేసిన చంద్రబాబు యోగా కూడా చేసి ఆ తరువాత తన గదికి వచ్చిన వివిధ పత్రికలను ఆయన చదవినట్టుగా జైలు అధికారులు మీడియాకు వెల్లడించారు. ఇంటి నుంచి వచ్చిన అల్పాహారాన్ని తిని చంద్రబాబు రెస్ట్ తీసుకుంటున్నట్లు సిబ్బంది తెలిపారు.