టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ చేసి జైలుకు పంపించిన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
దీనిపై దేశ వ్యాప్తంగా పలువురు నాయకుల నుండి స్పందన వస్తుంది. చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై పలువురు చంద్రబాబుకు మద్దతుగా స్పందిస్తున్నారు.తాజాగా తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. అయితే చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఆయన ఆచితూచి మాట్లాడారు. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కర్ర విరగలేదు పాము చావలేదు అన్నట్టుగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ సరైనదని కానీ, సరైనది కాదని కానీ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేయలేదు.చంద్రబాబు అరెస్టుపై ఆయన చాలా డిప్లమాటిక్ గా మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ తన వద్ద లేవని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసినట్టు తమకు తెలిసిందని పేర్కొన్నారు. తమ పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి చెప్పినదాన్ని బట్టి చూస్తే అరెస్టు చేసిన విధానం సరిగ్గా లేదని తెలిసిందని ఆయన తెలిపారు.అంతేకాదు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా చంద్రబాబును అరెస్టు చేసినట్టుగా తెలిసిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇక కిషన్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డా. లక్ష్మణ్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు సబబు కాదని పేర్కొన్నారు.ఈ అరెస్టును బిజెపి తప్పు పడుతోందని ఆయన తెలిపారు. ఆయనను ఎలాంటి వివరణ లేకుండా అరెస్టు చేశారని ఎఫ్ఐఆర్లో కూడా చంద్రబాబు పేరు చేర్చలేదని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టును బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. కానీ తెలంగాణా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అందుకు భిన్నంగా మాట్లాడారు