IND vs PAK : టీమిండియా (Team India) ముందు పాకిస్తాన్ (Pakistan) జట్టు పసికూనగా మారిపోయింది. ఆసియా కప్ 2023 (Asia Cup 2023)లో భాగంగా జరిగిన పోరులో పాకిస్తాన్ పై భారత్ భారీ తేడాతో నెగ్గింది.
ఏకంగా 228 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 357 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ ను భారత పేసర్లు వణికించేశారు. దాంతో పాకిస్తాన్ 32 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. పాకిస్తాన్ తరఫున ఫఖర జమాన్ (27) టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో మెరిశాడు. పాకిస్తాన్ పేసర్లు నసీమ్ షా, హరీస్ రవూఫ్ లు గాయాలతో బ్యాటింగ్ కు రాలేదు. దాంతో వారిని రిటైర్డ్ హర్ట్ గా ప్రకటించారు.లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ను భారత బౌలర్లు వణికించారు. జస్ ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ లు పాకిస్తాన్ ఓపెనర్లను హడలెత్తించారు. ఏడాదిన్నర తర్వాత తొలిసారి వన్డే మ్యాచ్ లో బౌలింగ్ చేస్తున్న బుమ్రా.. బంతిని స్వింగ్ చేస్తూ పాకిస్తాన్ ఓపెనర్లను ఒక ఆట ఆడుకున్నాడు. పాకిస్తాన్ బౌలర్లను ఉతికారేసిన పిచ్ పై భారత బౌలర్లను బాబర్ సేన ఆడలేకపోయింది. ఇమాముల్ హక్ (9), బాబర్ ఆజమ్ (10), రిజ్వాన్ (2), షాదాబ్ ఖాన్ (6) అలా వచ్చి ఇలా వెళ్లారు. ఫఖర్ జమాన్ టెస్టు బ్యాటింగ్ ఆడాడు. సల్మాన్ (23), ఇఫ్తికర్ అహ్మద్ (23) కాసేపు వికెట్లను అడ్డుకున్నారు. అయితే కుల్దీప్ యాదవ్ ఎంట్రీతో పాకిస్తాన్ పేకమేడలా కూలింది. బౌలింగ్ చేస్తూ గాయపడ్డ హరీస్ రవూఫ్, నసీమ్ షాలు బ్యాటింగ్ కు రాలేదు.అంతకుముందు కేఎల్ రాహుల్ (106 బంతుల్లో 111 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లీ (94 బంతుల్లో 122 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు)లు సెంచరీలతో కదం తొక్కారు. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 2 వికెట్లకు 356 పరుగులు చేసింది. వీరిద్దరి దెబ్బకు పాకిస్తాన్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. తన బెస్ట్ ను ఇంకా చూడలేదంటూ బీరాలు పలికిన షాహీన్ అఫ్రిది 10 ఓవర్లలో ఏకంగా 79 పరుగులు సమర్పించుకున్నాడు. పార్ట్ టైమ్ బౌలర్ ఇఫ్తికర్ అహ్మద్ 5 ఓవర్లలోనే 46 పరుగలు ఇచ్చుకున్నాడు. రోహిత్ శర్మ (56), శుబ్ మన్ గిల్ (58) అర్ధ సెంచరీలతో రాణించారు.కమ్ బ్యాక్ లో సూపరో సూపర్తనపై వస్తున్న విమర్శలకు కేఎల్ రాహుల్ సమాధానమిచ్చాడు. అయితే నోటితో కాదు బ్యాట్ తో. ఎవరైతే తన ఆటతీరుపై కామెంట్స్ చేస్తున్నారో వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. నాలుగు నెలల తర్వాత మ్యాచ్ ఆడుతున్న కేఎల్ రాహుల్ అజేయ శతకంతో కదం తొక్కాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన అతడు.. ట్రేడ్ మార్క్ షాట్స్ తో అలరించాడు. అతడి ఆటను చూసిన తర్వాత వరల్డ్ కప్ కు ఎంపిక చేయడం సరైన నిర్ణయమే అనే అభిప్రాయాన్ని అభిమానుల్లో కలిగించేలా చేశాడు.