రాజకీయ నేతలు అరెస్టు కావడం, జైలుకెళ్లడం దురదృష్టకర సంఘటన, బాధాకర అంశం అన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఐతే.. ప్రజాస్వామ్యంలో ఆధారాలు లేకుండా కోర్టులు నిర్ణయాలు తీసుకోవన్నది గమనించాల్సిన అంశం అన్నారు.
ఈ ఎపిసోడ్ నుంచి సింపతీ, రాజకీయ లబ్దిని పొందే ప్రయత్నం జరుగుతోందని అంబటి అన్నారు. బాబును జైలుకి పంపి, ఆనందపడే ఉద్దేశం తమకు లేదన్నారు. చంద్రాబాబు ఎన్నో అన్యాయాలు, మోసాలు, అవినీతికి పాల్పడినా… ఎన్ని నేరాలు చేసినా, ఇన్నాళ్లూ బోను ఎక్కలేదన్న అంబటి రాంబాబు…. సంస్థలు, వ్యవస్థల్ని చాకచక్యంగా మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. ఇక మేనేజ్ చేసే రోజులకు కాలం చెల్లిందన్నారు.
నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేశాక… చాలా డ్రామాలు ఆడారన్న అంబటి… రోడ్డు మార్గంలోనే వెళ్తే.. ప్రజలు తన కాన్వాయ్‌ని ఆపేస్తారని అనుకున్నారనీ… కానీ అచ్చెన్నాయుడు లాంటి వారు ఫోన్లు చేసినా.. ఒక్కరు కూడా రాలేదని అంబటి అన్నారు. బాబు జీవితం అవినీతిమయం అనే విషయం అందరికీ తెలుసన్న ఆయన.. అందుకే గందరగోళం ఏదీ జరగలేదని అన్నారు. చంద్రబాబుకి నిరాశ తప్పలేదన్నారు.
చంద్రబాబు విజయవాడకు రాకముందే, కోట్ల రూపాయలు ఫీజు తీసుకునే లాయర్లు ప్రత్యేక విమానాల్లో వచ్చేశారనీ, సుప్రీంకోర్టులో వాదించే 30, 40 మంది లాయర్లు వచ్చేశారని అంబటి సెటైర్ వేశారు. ఎవరు ఎన్ని చేసినా, బలమైన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే కోర్టు చంద్రబాబును జైలుకు పంపిందన్న అంబటి… ఇది కక్షసాధింపు చర్య ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు.
అమరావతి అంశంలోనూ చంద్రబాబు చాలా అక్రమాలకు పాల్పడ్డారన్న అంబటి.. ఆ లెక్కలు కూడా తేలాలన్నారు. చంద్రబాబు అవినీతి బాగోతం.. ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం ఖాయం అన్నారు అంబటి. ప్రజలు, న్యాయస్థానం ప్రజాస్వామ్యం వైపు ఉన్నాయన్న అంబటి.. పవన్ కళ్యాణ్ .. అనర్హుడు, ఇంగితజ్ఞానం లేనివాడు అన్నారు. రాజకీయాలు తెలియనివారు రాజకీయ పార్టీ పెడితే ఇలాగే ఉంటుందన్న అంబటి… ఒకప్పుడు చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలన్న పవన్.. ఇప్పుడెందుకు మాట మార్చారని ప్రశ్నించారు. దుర్మార్గమైన పద్ధతిలో పవన్ కళ్యాణ్.. చంద్రబాబును సపోర్ట్ చేస్తున్నారనీ… ఈ అవినీతిలో పవన్ కళ్యాణ్‌కి కూడా భాగం ఉందని అంబటి అన్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి అన్నారు.