వేలేరుపాడు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి పరిస్ధితులైనా ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం వేలేరుపాడు యంఇఓ కార్యాలయంలో వేలేరుపాడు, కుక్కునూరులో వరద పరిస్ధితిపై జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణిలతో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతు గోదావరి వరద నేపద్యంలో బాధితులకు అందుబాటులో ఉంటూ ఎటువంటి సమస్యలు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. వరదలు మూలంగా ప్రాణ, ఆస్ది నష్టాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఏ ఒక్క ప్రాణ నష్టానికి తావులేకుండా చూడాలన్నారు. గత ఏడాది వరదలు సమయంలో ఎదురైన సంఘటనలు పునరావృతం కాకుండా మరింత పటిష్టంగా పునరావాస సహాయక చర్యలు చేపట్టాలన్నారు. మహరాష్ట్ర, తెలంగాణలో అధిక వర్షాలు నేపద్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో మరింత వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందన్నారు. వరద మూలంగా కోయిదా, కట్కూరు ప్రాంతంలో 16 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయన్నారు. అక్కడి ప్రజలకు అవసరమైన నిత్యావసరవస్తువులను పౌరసరఫరాల శాఖ సమకూర్చే చర్యలుచేపట్టాలన్నారు. మూడు నెలలకు సరిపడే నిత్యావసర వస్తువులను నిల్వలను సిద్ధంగా ఉంచాలని డియం సివిల్ సప్లైయిస్ ను అదేశించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న బియ్యం నిల్వలను ఎగువ ప్రాంతాల్లో నిల్వచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొవ్వోత్తులు,బ్యాటరీ లైట్లు కూడా సమకూర్చాలన్నారు. విద్యుత్ శాఖకు సంబంధించి జనరేటర్లు సిద్దం చేయాలన్నారు. అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతోపాటు 21 రోజులకు సరిపడే మందులును అందుబాటులో ఉంచాలన్నారు. ముఖ్యంగా పాముకాటు ఇంజక్షన్లు, రక్తపోటు, షుగరు, గుండెకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచాలని డియంహెచ్ఓను ఆదేశించారు. మలేరియా,డెంగ్యూ పరీక్షా కిట్లతోపాటు అందుకు సంబంధించిన మందులను కూడా అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి వైద్య శిబిరంలో మెడికల్ ఆఫీసరును అందుబాటులో ఉంచాలన్నారు. ఇప్పటికే వరద ముంపు స్ధంబించిన గ్రామాల్లో ఎఎన్ఎంలు, ఆశా వర్కర్లను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అవసరమైన అధనపు సిబ్బందిని రప్పించాలన్నారు. మాసంలో ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణీలను గుర్తించి సిహెచ్ సి, పిహెచ్ సిలకు తరలించాలన్నారు. రెండు నెలల్లో ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణీల ఆరోగ్యాన్ని సంబంధిత ఎఎన్ఎంలు, ఆశా వర్కర్లు పర్యవేక్షించాలన్నారు. మూడు, నాలుగు, నెలల్లో ప్రసవానికి సిద్దంగా ఉన్న గర్భిణీలకు రెండు నెలల రేషన్ అందుబాటులో ఉంచేందుకు ఐసిడిఎస్ ఉన్నత అధికారులతో జాయింట్ కలెక్టర్ సంప్రదించాలన్నారు. మండల ప్రధాన కార్యాలయంలో రెండు 108 అంబులెన్స్ లు సిద్ధంగా ఉంచాలన్నారు. వరదలు వచ్చి, తగ్గిన మద్య కాలంలో పారిశుధ్య కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టాలని డిపిఓను ఆదేశించారు. అందుకు అవసరమైన బ్లీచింగ్, ఇతర సామాగ్రిలతో సిద్దం చేసుకోవడంతోపాటు డిటిసిని సంప్రదించి ట్రాక్టర్లు,జేసిబిలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల వద్ద హ్యాండ్ బోర్లు ఏర్పాటు చేయాలని డ్వామా పిడిని కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన అన్ని మంచినీళ్ల ప్యాకెట్లను, క్లోరిన్ బిళ్లను సిద్దంగా ఉంచాలని ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఇ ని కలెక్టర్ ఆదేశించారు.వరద ఉదృతి మరింత పెరిగి రాకపోకలకు స్ధంబించేందుకు అవకాశం ఉన్న గ్రామాల్లో తక్షణమే మొబైల్ ఆర్వో ప్లాంట్లను పంపించాలని ఆదేశించారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ట్రాక్టర్లను, మినీ లారీలను సిద్ధం చేయాలన్నారు. ఇందుకు మినీ లారీలను డిటిసి అందుబాటులో ఉంచాలన్నారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కుక్కునూరు మండలానికి సంబంధించి జంగారెడ్డిగూడెం ఆర్డిఓ, వేలేరుపాడు మండలానికి సంబంధించి ఐటిడిఏ పిఓలు పర్యవేక్షించాలన్నారు. తరచూ సంభవిస్తున్న వరదను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంలో వరద వచ్చినా మునగని ఎగువ ప్రాంతంలో రెండు షెడ్లతో శాశ్వత పునరావాస కేంద్రం ఏర్పాటుకు అవసరమైన స్ధలాన్ని గుర్తించాలని పంచాయితీరాజ్, రెవిన్యూ,పోలీసు అధికారులకు కలెక్టర్ సూచించారు. వరద బాధితులకు విద్యుత్ సరఫరాకు సంబంధించి గత వరదల సమయంలో ఎదురైన సమస్యను దృష్టిలో ఉంచుకొని అందుకు అవసరమైన జనరేటర్లను అందుబాటులో ఉంచాలన్నారు. అదే విధంగా బిఎస్ఎన్ఎల్, ఎయిర్ టెల్ వంటి తదితర టవర్ల వద్ద జనరేటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు ఎనర్జీ అసిస్టెంట్లను ఆయా టవర్ల వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. అందుబాటులో ఉన్న దేశీయ మోటారు బోట్ల వివరాలను సేకరించుకోవడంతోపాటు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని మత్య్సశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నిత్యావసర వస్తువులను ప్యాకింగ్ చేసేందుకు స్ధానికంగా ఉన్న ఎస్ హెచ్ జి గ్రూపులను సిద్దంగా ఉంచుకోవాలని డిఆర్ డిఏ పిడిని కలెక్టర్ ఆదేశించారు. అదే విదంగా పునరావాస కేంద్రాలకు బాధితులు వెళ్లేలా ఎస్ హెచ్ జి గ్రూపులు ఒప్పించాలన్నారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఏమైనా పంటనష్టం జరిగే అవకాశం ఉంటే ఆవివరాలు రోజువారి నివేదిక ద్వారా సమర్పిచాలని వ్యవసాయశాఖ జేడి ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పశువులను ఎగువ ప్రాంతాలకు తరలించాలని అదే విధంగా పశుగ్రాసం అందుబాటులో ఉంచాలని పశుసంవర్ధక జేడిని కలెక్టర్ ఆదేశించారు. వ్యాధినిరోధక టీకాలను, మందులను, వెటనరీ అసిస్టెంట్లను అందుబాటులో ఉంచాలన్నారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించే సమయంలో పోలీసు సిబ్బంది అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. భద్రాచలం, పోలవరం, దవళేశ్వరంలకు సంబంధించి వరద పరిస్ధితిపై ప్రతి రెండు గంటలకు నివేదికను అందజేయాలని ఇరిగేషన్ ఎస్ఇని కలెక్టర్ ఆదేశించారు. పోలవరం నెక్లెస్ బండికి సంబంధించి గతంలో ఎక్కడైతే కోత గురైయిందో అక్కడ ఇరిగేషన్, పోలీస్,రెవిన్యూ సంబంధించి ఇద్దరేసి సిబ్బందిని పర్యవేక్షణకు నియమించాలన్నారు. గట్టుకోతకు గురైతే వెంటనే చర్యలు చేపట్టేందుకు జేసిబిలు సిద్దంగా ఉంచాలన్నారు. వర్షాలు మూలంగా ఎక్కడైనా రోడ్లకు గుంతలు పడినచోట్ల వెంటనే వాటిని మరమ్మత్తు చర్యలు చేపట్టాలని పంచాయితీరాజ్, ఆర్ అండ్ బి ఎస్ ఇలను కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడైనా రోడ్లపై చెట్లు పడినా వెంటనే రెవిన్యూ , ఫైర్, అధికారులు సమన్వయం చేసుకొని 3, 4 గంటల్లో తొలగించాలన్నారు. ఎన్ డిఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు బోట్లద్వారా పునరావాస కార్యక్రమాల్లోపాల్గొనే సమయంలో , అధికారులు, బాధితులకు నిత్యావసరాలు ఆందించే సమయంలో తప్పనిసరిగా లైఫ్ జాకెట్స్ ధరించి అధికారులకు తోడుగా ఉండాలన్నారు. పునరావాస కేంద్రాల్లో కూరగాయలు అందించేందుకు మార్కెఫెడ్ అధికారులు సిద్దంగా ఉండాలన్నారు. సమావేశంలో, నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్ష్ రాజేంధ్రన్, అసిస్టెంట్ కలెక్టర్ అపూర్వ భరత్, పిఓ ఐటిడిఏ సత్యనారాయణ, జంగారెడ్డిగూడెం ఆర్డిఓ ఝాన్సీరాణి, జెడ్పి సిఇఓ రవికుమార్, జెడ్పిటిసి రామలక్ష్మి, యంపిపి లక్ష్మీదేవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
