ముఖ్యమంత్రి జగన్ మూడు రోజుల కడప పర్యటన ఖరారైంది. ఈ నెల 8 నుంచి పదో తేదీ వరకు సీఎం జగన్ కడప జిల్లాలోనే ఉండనున్నారు. ఈ నెల 8న దివంగత వైఎస్సార్ జన్మదినం నాడు జగన్ ముందుగా కళ్యాణదుర్గంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి ఇడుపులపాయకు చేరుకుంటారు. అదే రోజు వైఎస్సార్ కు నివాళి అర్పించేందుకు అక్కడకు షర్మిల రానున్నారు. కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం నడుమ షర్మిల ఇడుపులపాయ పర్యటన ఆసక్తి పెంచుతోంది.
ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 8న మధ్యాహ్నం 2 గంటలకు నేరుగా వైఎస్సార్ ఘాట్ కు చేరుకొని తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. ఆ తరువాత ఇడుపులపాయలోని ప్రార్థన మందిరానికి వెళతారు. అక్కడ సింహాద్రిపురం మండల నాయకులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 5:30 గంటలకు అక్కడి నుంచి ఇడుపులపాయలోని ఇంటికి వెళ్లనున్నారు. 9వ తేదీ ఉదయం ఇడుపులపాయ నుంచి బయలుదేరి గండికోటకు వెళ్లనున్నారు. ఒబెరాయ్ హోటల్ కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం గండికోట వ్యూపాయింటు చేరుకోనున్నారు.
గండికోట నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి ఉదయం 10.50గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలిప్యాడ్ కు చేరుకుంటారు. పులివెందులలో నూతన మున్సిపల్ భవనాన్ని, సిటీ ఫారెస్ట్, గరండాల వంక, వైఎస్సార్ ఇస్టా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్, న్యూటెక్ బయోసైన్స్ లను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1 పులివెందులలోని ఆర్అండ్ బి అతిథి భవనానికి చేరుకుంటారు. పులివెందులలోని వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించనున్నారు. భాకరాపురంలోని హెలిప్యాడ్ కు చేరుకొని ఇడుపులపాయకు వెళ్లనున్నారు. అక్కడ మధ్యాహ్నం ప్రజా ప్రతినిధులతో మాట్లాడనున్నారు. సాయంత్రం ఇడుపులపాయలోని ఇంటికి వెళ్లనున్నారు
10వ తేదీ ఉదయం ఇడుపులపాయ నుంచి కడపలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులతో మాట్లాడతారు. రోడ్డు మార్గాన కడపలోని రాజీవ్ మార్గ్ కు చేరుకుని రాజీవ్ పార్క్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. 10వ తేదీన హెలికాప్టర్ ద్వారా కడప సమీపంలోని కొప్పర్తికి చేరుకుంటారు. అక్కడ అల్టిక్సన్ యూనిట్ ను ప్రారంభించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనల్లో పాల్గొంటారు. అనంతరం కడప విమానాశ్రయానికి చేరుకుని మధ్యాహ్నం 12.15కు బయలుదేరి గన్నవరంకు వెళ్లనున్నారు