నారాయణ యాక్టివ్ అయ్యారా?

Is Narayana active?

పొంగూరు నారాయణ అంటే ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరంలేదు. ఎందుకంటే రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియలో బాగా పాపులరయ్యారు. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు తర్వాత నెంబర్ 2గా ఐదేళ్ళూ చెలామణయ్యారు. అందుకనే నారాయణ గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదన్నది. అలాంటి నారాయణ ఇంతకాలానికి మళ్ళీ యాక్టివ్ అయ్యారు. 2019లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత రాజకీయాల నుండి దాదాపు సైడయిపోయారు. అప్పట్లో అంత యాక్టివ్ గా ఉన్న నారాయణ మీద సహజంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురిపెట్టింది.

ప్రభుత్వం టార్గెట్ పెట్టడంతో ఎందుకొచ్చిన తలనొప్పులని నారాయణ సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే నారాయణ రాజకీయ నేత మాత్రమే కాదు అంతకుముందు వ్యాపారస్తుడు. నారాయణ విద్యాసంస్ధల ఛైర్మన్ హోదాలో అర్ధికంగా అత్యంత పటిష్టమైన స్ధితిలో ఉన్నారు. దానికి 2014లో మంత్రి తోడైంది. ఇదే సమయంలో మరో మాజీమంత్రి గంటా శ్రనివాసరావుకు వియ్యంకుడు కావటం నారాయాణకు  బాగా కలిసొచ్చింది. అసలే ఆర్ధిక, అంగబలం ఉన్న నారాయణకు అధికారం కూడా తోడవ్వటంతో తిరుగులేని వ్యక్తిగా తయారయ్యారు.

ఇలాంటి నారాయణ పోయిన ఎన్నికల్లో నెల్లూరు సిటిలో ఓడిపోయారు. దాని తర్వాత విద్యాసంస్ధల నిర్వహణలో అవకతవకలంటు ప్రభుత్వం కేసులుపెట్టింది. అలాగే పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకీజీ వ్యవహారం కూడా నారాయణకు చుట్టుకుంది. అంతకుముందే అమరావతి నిర్మాణంలో భూకుంభకోణం జరిగిందని ప్రభుత్వం పదేపదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అన్నీ కలిసిపోయి నారాయణ మీద కేసులు, విచారణలో కూరుకుపోయారు.

అందుకనే దాదాపు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. అలాంటి నారాయణ సడెన్ గా మంగళవారం వెలుగులోకి వచ్చారు. నెల్లూరు రూరల్ వైసీపీ రెబల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డి ఇంటికి వెళ్ళారు. కోటంరెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అబ్దుల్ అజీజ్ ను కోటంరెడ్డితో కలిపారు. అజీజ్ సహకారంతో కోటంరెడ్డి గెలుపు ఖాయమన్నట్లుగా నారాయణ మాట్లాడారు. చూడబోతే నారాయణ మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అయినట్లే అనిపిస్తోంది.  ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి కాదా అందుకనే మళ్ళీ నెల్లూరు సిటి నుండి పోటీచేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లున్నారు. అందుకనే యాక్టవ్ అయ్యారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these