పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన కాపు ఓట్లను సంఘటితం చేస్తోందో, చీలుస్తోందో అర్థం కావడం లేదు. గత ఐదు రోజుల నుంచి జరుగుతున్న పవన్ వారాహి పర్యటనలో పవన్ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ చర్చనీయాంశం అవుతున్నాయి. జనసేనాని భాష పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముద్రగడ పద్మనాభం నిన్న ఒక బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖలో ముద్రగడ పవన్ భాష ను ఆక్షేపించారు. ‘కింద కూర్చోబెడతా, గుండు కొట్టిస్తా’లాంటి మాటలు నాయకుడు వాడాల్సిన మాటలు కాదని ముద్రగడ హితవు పలికారు. దశాబ్దాల పాటు కాపుల హక్కుల కోసం పోరాడుతున్న నాయకుడిగా ముద్రగడకు గోదావరి జిల్లాల్లో మంచి పేరు ఉంది. ఆంధ్రాలో రాజకీయం వేడెక్కుతున్న వేళ ఆయన విడుదల చేసిన బహిరంగ లేఖ ఆంధ్రప్రదేశ్ లో కొత్త వివాదానికి తెర తీసింది.