తమిళం లో సూపర్ హిట్ అయిన చంద్రముఖి చిత్రాని కి సీక్వెల్ గా వస్తున్న ‘చంద్రముఖి 2’ ఇటీవల చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రం లో కంగనా రనౌత్ ప్రధాన పాత్ర లో నటించగా లారెన్స్ విలన్ పాత్రలో నటించాడని చెబుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం… సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని టీమ్ తమ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ప్రకటించింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. పి వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో వడివేలు- రాధికా శరత్కుమార్- లక్ష్మీ మీనన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ చిత్రం 15 సెప్టెంబరు 2023న థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. త్వరలో నే అధికారిక ప్రకటన వెలువడనుంది.
లారెన్స్ ఇంతకుముందు కాంచన సిరీస్ తో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. హారర్ జానర్ తనకు కొట్టిన పిండి. ఇప్పుడు కంగన లాంటి ఛాలెంజర్ తో నువ్వా నేనా? అంటూ పోటీపడుతూ అతడు విలనీ ని పండించనున్నాడు. కంగన (Vs) లారెన్స్ ఎపిసోడ్స్ సినిమాకి ప్రధాన బలం కానున్నాయని చెబుతున్నారు.
అయితే పి.వాసు రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ .. జ్యోతిక లాంటి లేడీ సూపర్ స్టార్ తో చంద్రముఖి తెరకెక్కించారు. సినిమా ఆద్యంతం సైకలాజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో రక్తి కట్టించింది. ఈ చిత్రం లో సైకాలజిస్టు గా రజనీకాంత్.. చంద్రముఖి(ఆత్మ)గా జ్యోతిక అద్భుత నటన తో కట్టి పడేశారు.
రజనీ లకలకలక ఆహార్యం మర్చిపోలేనిది. అందుకే ఇప్పుడు పార్ట్ 2 తో తిరిగి అలాంటి మ్యాజిక్ సాధ్యపడుతుందా? అంటూ అంతా సందేహిస్తున్నారు. అయితే కంగన- లారెన్స్ లాంటి పెర్ఫామర్స్ తో పి.వాసు మ్యాజిక్ చేసేందుకు ఆస్కారం లేకపోలేదు. కథ-కథనం లో సత్తా ఉంటే కచ్ఛితంగా మునుపటి భాగం అంత ఎఫెక్టివ్ గా వర్కవుటయ్యే ఛాన్సుంటుందని అంచనా.
