కళ్యాణదుర్గంలో స్థానికత కాక.. మంత్రి ఉష శ్రీచరణ్కు డేంజర్ బెల్స్

రోజులన్నీ ఒకేలా ఉండవు అన్నట్టుగా రాజకీయాలు కూడా ఒకేలా లేవు. వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో అధికార పార్టీ వైసీపీలో టికెట్ల కోసం నాయకులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా మంత్రులు గా ఉన్న వారికి కాక పెరుగుతోంది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో స్థానికేతరులకు గత ఎన్నికల్లో వైఎస్ జగన్ టికెట్లు కేటాయించారు. ఇలాంటివాటిలో అనంతపురంలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం ఒకటి.



ఇక్కడ ఉష  శ్రీచరణ్కు సీఎం జగన్ టికెట్ కేటాయించారు. నిజానికి ఉష మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి కారు. కర్ణాటకలోని చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన మహిళ. అయితే.. ఇక్కడి శ్రీచరణ్ తో ఆమెకు ప్రేమ వివాహం జరిగింది. దీంతో ఇక్కడ ఉంటున్నారు. మధ్య మధ్య కర్ణాటకకు వెళ్లి వస్తున్నారు. శ్రీచరణ్కు సజ్జల రామకృష్ణారెడ్డి వైవీ సుబ్బారెడ్డి వంటివారితో పరిచయం ఉన్న నేపథ్యంలో ఆయన ప్రోత్సాహంతోనే ఉష రాజకీయాల్లోకి వచ్చారు.

గత 2014 ఎన్నికల్లో కళ్యాణ దుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2019లో మాత్రం జగన్ పాదయాత్ర హవా నేపథ్యంలో ఆమె విజయం దక్కించుకున్నారు. అయితే.. ఇక్కడ పార్టీని డెవలప్ చేసిన వారిని.. గత ఎన్నికల్లో తను గెలిచేలా సహకరించిన వారిని ఆమె పట్టించుకోవడం లేదనే వాదన కొన్నాళ్లుగా వినిపిస్తోంది. వారానికి నాలుగు రోజులు మాత్రమే ఆమె నియోజకవర్గంలో ఉంటున్నారని మిగిలిన సమయంలో ఆమె బెంగళూరులోనే మకాం వేస్తున్నారని చెబుతున్నారు.

ఇక జగన్ రెండో దశ మంత్రి వర్గ విస్తరణలో కురబ సామాజిక వర్గానికి చెందిన ఉష కు మంత్రి వర్గంలో చోటు కల్పించారు.అయితే.. ఆమె మాత్రం తన పూర్వ పంథానే అనుసరిస్తున్నారు. దీంతో ఆమెకు స్థానికంగా వైసీపీ నాయకులకు విబేదాలు తలెత్తాయి.

ఇప్పుడు ఏకంగా.. ఆమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దని కూడా సొంత పార్టీ నాయకుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. కర్ణాటకకు చెందిన ఉష శ్రీచరణకు టికెట్ ఇస్తే… ఈ సారి ఆమెను ఖచ్చితంగా ఓడించి తీరుతామని.. వైసీపీలోని నాయకులే తెగేసి చెబుతుండడంతో ఇక్కడ వివాదం మరింత రచ్చకెక్కినట్టయింది.

తాజాగా కల్యాణదుర్గంలో స్థానిక నాయకులంతా కలిసి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయే తిప్పేస్వామికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.  నియోజకవర్గంలోని అన్ని మండలాలు గ్రామాల కేడర్ ఉష శ్రీచరణ్కు వ్యతిరేకంగా ఉన్నట్లు నాయకులు చెబుతున్నారు.  ఉషశ్రీ చరణ్కి టికెటిస్తే మాత్రం కచ్చితంగా ఓడిస్తామని అసమ్మతి నేతలు హెచ్చరిస్తున్నారు.  మరి ఈ పరిస్థితిని జగన్ ఎలా సరిదిద్దుతారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these