పార్టీ బలంగా ఉంటేనే ప్రజాప్రతినిధులు బలంగా ఉంటారు. జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

నియోజకవర్గాల పునర్విభజనపై వాస్తవిక దృక్పథంతో ముందుకు వెళ్దాం* గెలుపే లక్ష్యంగా స్థానిక పోరుకు సిద్ధమవ్వండి* నిలబడిన ప్రతి చోటా జనసేన జెండా ఎగిరేలా కష్టపడండి* నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి * వారంలో ఒక రోజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం తప్పనిసరి * పార్టీ బలంగా ఉంటేనే ప్రజాప్రతినిధులు బలంగా ఉంటారు * జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంలో ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా, వాస్తవిక దృక్పథంతో ప్రజాప్రతినిధులు ముందుకు వెళ్లాలని ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉద్ఘాటించారు. 2009లో చివరిసారిగా పునర్విభజన జరిగినప్పుడు రాష్ట్రం, దేశంలో చోటు చేసుకున్న అంశాలను ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా, ప్రజాప్రయోజనమే పరమార్థంగా, సహేతుకంగా పునర్విభజన జరిగేలా జనసేన ప్రజా ప్రతినిధులు ముందుకు వెళ్లాలని సూచించారు.

ముఖ్యంగా జనసేన ప్రజాప్రతినిధులు అన్ని వర్గాలకు చేరువలో (రీచ్ అవుట్) ఉంటూ… నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో మంగళవారం విజయవాడలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నియోజక వర్గాల పునర్విభజన నిర్ణయం వల్ల రాష్ట్రంలో అసెంబ్లీతోపాటు పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి. ఇప్పుడున్న నియోజకవర్గాలను 50 శాతం పెంచాలన్న కేంద్రం నిర్ణయం హర్షణీయం. కేంద్రం నిర్ణయంతో 88 అసెంబ్లీ సీట్లు, 12 వరకు పార్లమెంట్ సీట్లు కొత్తగా పెరుగుతాయి. అంటే కొత్తగా 100 మంది ప్రతినిధులను చట్ట సభలకు పంపించే అవకాశం వచ్చింది.

దీనిని దృష్టిలో పెట్టుకొని డీలిమిటేషన్ ఎక్కడా దుర్వినియోగం కాకుండా చూసే బాధ్యత మనపై ఉంది. డీలిమిటేషన్ పై జనసేన ఏ విధంగా ముందుకు వెళ్లాలి? ఎటువంటి కార్యాచరణ అవలంబించాలి? అనే అంశాలపై సూచనలు చేయడానికి శాసనసభ్యులతో కూడిన కమిటీ నియమించాలని పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి సూచిస్తున్నాను. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా డీలిమిటేషన్ పై పార్టీ కార్యాచరణ నిర్దేశించుకుందాం.

• ప్రత్యేక ప్రణాళికతో స్థానిక పోరుకు సిద్ధమవుదాం కొద్ది నెలల్లో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు రానున్నాయి. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు పని చేయాలి. క్షేత్రస్థాయిలో కూటమి పార్టీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. ఏ ఎన్నిక జరిగినా గెలుపే లక్ష్యంగా కష్టపడాలి. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అభిలషణీయమైన సంఖ్యలో గెలుపొందడం మన శ్రేణుల పోరాట పటిమకు నిదర్శనం. వచ్చే స్థానిక పోరులో గెలుపే లక్ష్యంగా సిద్ధంగా ఉండాలి.

• ప్రజలతో మమేకం కావాలి పార్టీ బలంగా ఉంటేనే ప్రజా ప్రతినిధులు బలంగా ఉంటారు. దానిని దృష్టిలో పెట్టుకొని పార్టీ బలోపేతానికి ప్రజా ప్రతినిధులు ముందుండి పని చేయాలి. ఉద్యమి సభ్యత్వం ఎంత అధికంగా ఉంటే పార్టీ అంత బలంగా ఉంటుంది.ప్రజాప్రతినిధులు ఎన్నికల ముందు వివిధ వర్గాలు ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, రైతులు, కార్మికులు, కర్షకులు, మహిళలను ఏ విధంగా కలిసి ఓట్లను అభ్యర్థించామో… అదే విధంగా, అదే రీతిలో ఇప్పుడు కూడా నిరంతరం వారిని కలిసి వారి కష్టసుఖాలు తెలుసుకోవాలి. కొన్ని అసాధ్యమైన కోరికలు వ్యక్తమైనప్పటికీ సాధ్యాసాధ్యాలను వారి ముందు ఉంచితే వారి మనసులు గెలుచుకోవడం కష్టం కాదు. వారంలో ఏదో ఒక రోజు నియోజకవర్గంలో ఒక ప్రాంతంలో ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేపట్టాలి. వాటి పరిష్కారానికి కృషి చేయాలి. దీని కోసం పక్కాగా ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలి.

• జెన్ జి ఆలోచనలు అర్థం చేసుకోవాలి నియోజకవర్గాల అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికతో దృష్టి పెట్టాలి. వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధి, పరిశ్రమలు ఇలా అన్ని రంగాలపై దృష్టి సారించి అన్ని వర్గాల ప్రజలకు దగ్గరవ్వాలి. కులాలు లేకుండా సమాజం నడవదు. ప్రతి కులాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్లాలి. ప్రతి శాసనసభ్యుడు రాజకీయ వాస్తవికతకు దగ్గరగా ఉంటూ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేయాలి. రాష్ట్రంలో 8-12 శాతం వరకు యువత ఉన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో కూడిన మావన వనరులుగా వారిని తీర్చిదిద్దాలి. జెన్ జి ఆలోచనలు అర్థం చేసుకోవాలి. వారిని చేరువ అవ్వడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి. రాజకీయ కార్యకలాపాలకు కుటుంబ సభ్యులను ఎంత పరిమితి మేరకు అనుమతించాలో ప్రజాప్రతినిధులు ఎవరికి వారు లోతుగా ఆలోచన జరిపి నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం ప్రజలు హర్షించేలా ఉండాలి. వ్యక్తులు చేసిన పనులు వ్యక్తులకే పరిమితం అవ్వాలి. అంతే తప్ప వాటి ఆధారంగా పార్టీపై ప్రభావం పడకూడదు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా నిధులు సమకూర్చాము. వాటి సద్వినియోగంపై అందరూ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. అవి క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరువ కావాలి. జల్ జీవన్ మిషన్ 2 .0 కి ఈ రోజు ఎం.ఓ.యూ. చేసుకున్నాము. జల్ జీవన్ నిధులతో ప్రతి ఇంటికీ తాగు నీరు ఇచ్చే లక్ష్యంతో పని చేస్తున్నాము. ప్రతి నియోజకవర్గానికి పీఆర్ ఆర్డీ శాఖలు, ఆర్. డబ్ల్యు.ఎస్. ద్వారా నిధులు అందుతున్నాయి. వాటి ద్వారా చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు తెలియచెప్పాల్సిన బాధ్యత మీపైనే ఉంది” అన్నారు.

• పోటీ చేసిన ప్రతి చోట గెలవాలి : శ్రీ నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… “సంఖ్యాపరంగా అసెంబ్లీలో జనసేన పార్టీ రెండో స్థానంలో ఉండటం మనందరికీ గర్వ కారణం. స్థానిక సంస్థల ఎన్నికలకు స్థానికంగానే వ్యూహరచన చేసుకోవాలి. డీలిమిటేషన్ లో చేర్పులు, మార్పులు, విభజన ప్రక్రియలు జిల్లా యంత్రాంగం చేతుల్లో కేంద్రీకృతమై ఉంటాయి. గతంలో జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియ ఆధారంగా ఈ మాటలు చెబుతున్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి చోట గెలిచి నూటికి నూరు శాతం ఫలితాలు రాబట్టుకోవాలి అని కోరారు.

• ఆహ్లాదకరంగా సాగిన సమావేశం లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. 3 గంటల సేపు కొనసాగిన ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభోపన్యాసం చేశారు. ఆ తరువాత గ్రూపులుగా, విడివిడిగా అందరి సభ్యులతో కలిసి మాట్లాడారు. ఈ సమావేశంలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చిన క్రమంలో ముఖ్యమైన అంశాల మీద అధ్యయనానికి పార్టీకి, సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రజాప్రతినిధులతో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి సూచించారు. చర్చించిన అంశాలు ప్రజలు, పార్టీకి ఉపయోగపడేలా మలుచుకోవాలని సూచించారు. ప్రతి నెల 3 లేదా 4వ వారంలో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల అందరితో సమావేశమవుతానని చెప్పారు. వచ్చే నెల తొలి వారంలో ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తామని, ఈ సమావేశంలో రాజకీయంగా పార్టీ శ్రేణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి చర్చిస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these