తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై గత జగన్ ప్రభుత్వానికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ మరో పర్యటనకు శ్రీకారం చుట్టారు. గుంటూరు తర్వాత ఇక ఇబ్రహీంపట్నానికి వెళ్లనున్నారు.
జగన్ నిర్వహించిన గుంటూరు పర్యటన అనుకున్నదానికంటే అధికంగా విజయవంతం కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపింది. సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ తిరుమల లడ్డూ కల్తీ జరిగిందంటూ టీడీపీ సారథ్యంలోని కూటమి నాయకులు ఊరూరా ఫ్లెక్సీలు వేయడం, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు దాడులకు దారి తీశాయి. పెట్రోల్ బాంబులు విసురుకునేంత స్థాయికి చేరుకుందనేది తేటతెల్లమైంది.
ఈ పరిణామాల మధ్య టీడీపీ కూటమి అధినేతలు నేడు సమావేశం కాబోతోన్నారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటోన్న జనసేన చీఫ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మాధవ్.. చంద్రబాబుతో భేటీ . ఈ ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం ఏర్పాటు . తిరుమల లడ్డూ అంశాన్ని ఎలా తిప్పి కొట్టాలి, జగన్ దూకుడును ఎలా అడ్డుకోవాలనే విషయంపై చర్చించే అవకాశం ఉంది.
ఈ ఉదంతంలో వైఎస్ఆర్సీపీ దూకుడును అడ్డుకోవడం కూటమికి ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీంతో పాటు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చ జరగనుందని తెలుస్తోంది. శుక్రవారం నుంచి పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనబోతోన్నారు. దీనికి సంబందించిన రూట్ మ్యాప్, బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి అనుసరించాల్సిన వ్యూహాలు కూడా ఈ సందర్భంగా వారి మధ్య చర్చించే అవకాశం ఉంది.
