School Holiday Today: విద్యార్ధులకు పండగలాంటి వార్త.. ఆ జిల్లాల్లోని అన్ని స్కూళ్లకు నేడు సెలవ్‌!

School Holiday Today: విద్యార్ధులకు పండగలాంటి వార్త.. ఆ జిల్లాల్లోని అన్ని స్కూళ్లకు నేడు సెలవ్‌!

Schoool Holiday : నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలకు చెందిన కలెక్టర్లు హెచ్చరికలు జారీ చేశారు..

అమరావతి, అక్టోబర్ 23: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్​ జారీ చేసింది. ప్రస్తుతం తమిళనాడు తీరం నుంచి అల్పపీడనం వాయవ్య దిశగా కదిలి అదే ప్రాంతంలో కొనసాగుతుంది. వాయువ్య దిశగా కదిలి మరికొన్నిగంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీంతో పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి.

భారీ వర్షాల నేపథ్యంలో గురువారం (అక్టోబర్ 23) చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతోపాటు అంగన్వాడి కేంద్రాలకు కలెక్టర్ సుమిత్ కుమార్ సెలవు ప్రకటించారు. ఈ రోజు అల్పపీడనం ప్రభావంతో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని పాఠశాలలకు సెలవు ఇస్తున్నామని, విద్యార్ధులు, టీచర్లు ఎవ్వరూ పాఠశాలలకు రావొద్దని తన ప్రకటనలో తెలిపారు. ఇతర జిల్లాల్లోనూ ఆయా పరిస్థితులకు అనుగుణంగా అధికారులు పాఠశాలల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అటు ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లాల్లోనూ అల్పపీడన ప్రభావంతో వర్షం దంచికొడుతుంది. తెల్లవారు జామున నుంచి బాపట్ల, నిజాంపట్నం, రేపల్లే ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. నిజాంపట్నం హార్బర్ లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

వాయుగుండం ఎఫెక్ట్‌తో నెల్లూరు జిల్లాలోనూ మూడు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి సోమశిల, కండలేరు జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో దిగువ ప్రాంతాలకు అధికారులు నీటిని విడుదల చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగుతున్నాయి. రాపూరు వద్ద రెండు గ్రామాలకు వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో కూడా అన్ని విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ సెలవులు ప్రకటించారు. అటు కృష్ణ జిల్లాలోనూ అన్ని పాఠశాలలకు ఈ రోజు సెలవు ప్రకటించారు. SPSR నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు, బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 35 నుంచి 55కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these