భీమవరం డీఎస్పీపై పవన్ కల్యాణ్ ఆగ్రహం, రఘురామ కితాబు…అసలేం జరిగింది?

భీమవరం డీఎస్పీపై పవన్ కల్యాణ్ ఆగ్రహం, రఘురామ కితాబు...అసలేం జరిగింది?

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య పనితీరుపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆ జిల్లా ఎస్పీని నివేదిక కోరినట్టు జనసేన పార్టీ మీడియాకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది.

అక్టోబర్ 21న పవన్ ఎస్పీతో మాట్లాడారు. అయితే అక్టోబరు 22న ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ ‘‘జయసూర్య మంచివాడని’’ వ్యాఖ్యానించారు.

రఘురామ వ్యాఖ్యలపై జనసేన నేత, కాపుకార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు స్పందించారు. ‘‘ఆయన అలా ఎలా మాట్లాడతారు’’ అని ప్రశ్నించారు.

దీనిపై గురువారం ‘‘పవన్‌ నిర్ణయాన్ని నేను ఎందుకు వ్యతిరేకిస్తాను’’ అని రఘురామ స్పందించారు.

అసలేం జరిగింది?

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య తీరుపై మంగళవారం పవన్‌కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ నయూం అష్మికి స్వయంగా ఫోన్‌ చేసి డీఎస్పీ గురించి మాట్లాడారు.

”డీఎస్పీ జయసూర్య పనితీరు బాగోలేదు. ఆయనపై అనేక ఫిర్యాదులొస్తున్నాయి. సబ్‌ డివిజన్‌ పరిధిలో పేకాట శిబిరాలు ఎక్కువయ్యాయి. డీఎస్పీ సివిల్‌ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని, కొందరి పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. అదేవిధంగా కూటమి నేతల సపోర్ట్‌ ఉందంటూ కొందరి పేర్లను డీఎస్పీ వాడుకుంటున్నారు. దీనిపై నాకు నివేదిక ఇవ్వండి ” అని పవన్ ఎస్పీని ఆదేశించారు.

భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత, రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకువెళ్లాలని పవన్‌ తన కార్యాలయ అధికారులకు ఆదేశాలిచ్చారు.

ఈ విషయాలన్నింటినీ వాట్సాప్ ద్వారా జనసేన మీడియా బాధ్యుడు మీడియాకు సమాచారం పేరుతో పంపారు.

ఆయనొక మంచి ఆఫీసర్: రఘురామకృష్ణరాజు

భీమవరం డీఎస్పీపై పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలు వచ్చిన నేపథ్యంలో బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే, శాసన సభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణ మాట్లాడారు.

విశాఖలో జరిగిన పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ భీమవరం డీఎస్పీ ప్రస్తావన తీసుకువచ్చారు.

”ఆయనొక మంచి ఆఫీసర్. నేనైతే అతను మంచి ఆఫీసర్‌ అని చెబుతాను. మా జిల్లాల్లో గోదావరి జిల్లాల్లో ఎవరుపడితే వారు ఇంట్లోనో ఎక్కడో చోట పేకాట ఆడేస్తుంటారు. అయితే రెండు మూడు నెలలుగా ప్రభుత్వం చాలా స్రిక్ట్‌గా వ్యవహరిస్తోంది. అందుకే తుపాను వస్తే తుపాను షెల్టర్‌కి వెళ్లినట్టు చాలామంది గోవా, శ్రీలంక వెళ్లిపోతున్నారు. ఇది నిజం. పేకాట మీద గవర్నమెంట్‌ ఉక్కుపాదం మోపిన తర్వాత భీమవరమే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎక్కడా జరగట్లే. భీమవరంలో కూడా ఎక్కడా జరగట్లే” అని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్ తన శాఖకే పరిమితం కాకుండా మిగిలిన శాఖలను కూడా పట్టించుకోవడం సంతోషించాల్సిన విషయమని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. రఘురామ ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు ఓ పక్క టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మరో పక్క జనసేన పార్టీకి చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల శ్రీనివాసరావు కూర్చున్నారు.

‘రఘురామ అలా ఎలా మాట్లాడతారు’

రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలపై జనసేనకు చెందిన సీనియర్‌ నేత, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ కొత్తపల్లి సుబ్బారాయుడు గురువారం మాట్లాడారు.

పవన్‌ వ్యాఖ్యలకు విరుద్ధంగా రఘురామ బహిరంగంగా ఎలా మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు.

‘పవన్‌ ఓ పార్టీ అధినేత, పైగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన పక్కా సమాచారం లేకుండా ఓ డీఎస్పీపై ఎందుకు విచారణ చేయమంటారు. ఆరోపణలకు సంబంధించి డీఎస్పీ పాత్ర లేదని ఒకవేళ విచారణలో తేలితే అప్పుడు పవనే వదిలేస్తారు. ఈలోగా రఘురామ ఉత్సాహం చూపించడం ఎందుకు? అని’ బీబీసీతో కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పారు.

‘పైగా రఘురామ వ్యాఖ్యలు గోదావరి జిల్లా వాళ్లంతా పేకాట ఆడేవాళ్లు, విలాసాల మనుషులుగా చిత్రీకరించే విధంగా ఉన్నాయి. అది చాలా తప్పు. ఏ విషయమైన మాట్లాడేటప్పుడు రఘురామ కాస్త ఆచితూచి మాట్లాడాలి’ అని కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు.

పవన్ చేసింది 100శాతం కరెక్ట్ : రఘురామ

పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించినట్టు జరిగిన ప్రచారంపై రఘురామ స్పందించారు. . తాను పవన్ నిర్ణయాన్ని వ్యతిరేకించాననడం సరికాదని ఆయన గురువారం మీడియావద్ద వ్యాఖ్యానించారు

” పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి డీఎస్పీ మీద ఫిర్యాదులు వస్తే ఆ ఫిర్యాదులపై విచారణ చేయమని ఆయన ఆదేశించారు. ఆయన చేసింది నూటికి నూరుపాళ్ళు సబబు.. ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యతగల డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఓ పార్టీ అధినేతగా ఆయన చేసింది నూటికి నూరుపాళ్ళు సబబు.. అయితే నా ఏరియాలో పని చేసే డీఎస్పీ గురించి నాకు తెలిసింది నేను చెప్పడం నా బాధ్యత.. నేను చెప్పేది తప్పా రైటా అనేది విచారణలో తెలుస్తుంది.. దీనికి డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ స్పీకర్ అని ప్రచారం జరగడం కరెక్ట్ కాదు ఆయన పోస్ట్ చాలా పెద్దది.. ఆయన మాటలను పూర్తిగా సమర్థించేనేను, నాకు తెలిసిన విషయాలను నేను చెప్పాను అంతే’’ అని రఘురామకృష్ణరాజు మీడియా వద్ద వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these