ఏపీలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి తొలిసారి విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని శివనాథ్ (చిన్ని), ఆయన పార్లమెంట్ స్ధానం పరిధిలోకి వచ్చే తిరువూరు ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి శ్రీనివాసరావు మధ్య గత కొంతకాలంగా సాగుతున్న పోరు మరోసారి పరాకాష్టకు చేరుకుంది. ఇవాళ ఉన్నట్లుండి కేశినేని చిన్నిపై కొలికపూడి చేసిన ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపాయి. దీంతో కేశినేని వీటికి కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకమాండ్ చర్యలకు దిగబోతోంది.
గత కొంతకాలంగా ఎంపీ కేశినేని చిన్నితో సాగుతున్న యుద్దానికి పరాకాష్టగా ఇవాళ ఎమ్మెల్యే కొలికపూడి తన వాట్సాప్ లో సంచలన స్టేటస్ పెట్టారు. అందులో ఆయన పార్టీ టికెట్ కోసం కేశినేని చిన్ని తనను ఐదు కోట్లు డిమాండ్ చేశారని, అరవై లక్షల చొప్పున మూడు విడతలుగా తాను చెల్లించానని తెలిపారు. అందుకు ఆధారంగా తన బ్యాంకు స్టేట్మెంట్ ను కూడా వాట్సాప్ స్టేటస్ లో పెట్టారు. అక్కడితో ఆగకుండా చిన్నికి తాను ఇచ్చిన డబ్బు వివరాలపై శుక్రవారం మాట్లాడుకుందామని కూడా హింట్ ఇచ్చారు.
దీనిపై ఎంపీ కేశినేని చిన్ని ఘాటుగా స్పందించారు. నిన్న మొన్నటివరకూ తనను దేవుడు అన్న కొలికపూడి ఇప్పుడు దెయ్యం ఎందుకు అయ్యానో సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబును అవమానించిన వాళ్లకి పదవులు ఎలా ఇస్తామని ప్రశ్నించారు. తాను కోవర్టులకు పదవులు ఇవ్వనని కేశినేని చిన్ని స్పష్టం చేశారు. తాను డబ్బులకు పదవులు ఇచ్చేవాడిని కాదన్నారు. ఎవరు ఎవరి పంచన చేరారో అందరికీ తెలుసన్నారు. కొలికపూడి పదవుల కోసమే ఇదంతా చేస్తున్నారని తేల్చేశారు. ఈ వ్యవహారం అధిష్టానానికి చేరిందని, వాళ్లే చూసుకుంటారని చిన్ని తెలిపారు.
మరోవైపు ఎంపీ కేశినేని చిన్నిపై కొలికపూడి ఆరోపణలు, దానికి చిన్ని ఇచ్చిన కౌంటర్ పై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫోన్ చేసి రేపు తమను కలవాలని పార్టీ నేతలు కొలికపూడికి సూచించారు. దీంతో కొలికపూడి రేపు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి నేతల్ని కలవబోతున్నారు. గతంలోనూ ఓసారి వీరిద్దరికీ మధ్య మాటల యుద్దం జరిగినట్లు అధిష్టానం జోక్యం చేసుకుంది. దీంతో అప్పట్లో సద్దుమణిగిన వీరిద్దరూ మళ్లీ గళం విప్పారు.
