తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం సక్రమంగా పనిచేయడం లేదా? పార్టీ కార్యాలయం వల్లనే పార్టీ ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుందా? నేతల మధ్య సమన్వయం లేకపోవడానికి కూడా పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం అనుసరిస్తున్న మెతక వైఖరి అని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు చేతుల్లోకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 1995 నుంచి ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ఏం మాట్లాడాలన్నా అది ముందు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వాల్సి ఉండేది. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియా సమావేశం పెట్టాలన్నా, లేకపోతే అసెంబ్లీ సమావేశాల్లో ఏ విషయాలను అయినా ప్రస్తావించాలన్నా ముందుగా పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం అందించాల్సి వచ్చేది.
