DSC Notification: ఇక ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తాం.. సర్కార్ స్పష్టం

ఇక ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తాం.. సర్కార్ స్పష్టం

ఇకపై ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని… దాని కోసం ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి నారా లోకేష్ కు సీఎం చంద్రబాబు చెప్పారు. మెగా డీఎస్సీలో విజేతలకు ఉపాధ్యాయ పోస్టుల నియామక పత్రాలను జారీ చేసే కార్యక్రమం గురువారం రాష్ట్ర సచివాలయం సమీపంలో..

చదువు చెప్పడంలో మహిళలే బెస్ట్

‘సూపర్ సిక్స్ హామీల్లో మొదటి హామీ యువతకు 20 లక్షల ఉద్యోగాలివ్వడమే. దాంట్లో భాగంగా మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశాను. మెగా డీఎస్సీని సూపర్ హిట్ చేశారు. ఉద్యోగం సంపాదించాలన్న మీ కోరిక తీరింది… పేదరికం లేని సమాజం చూడాలనేది నా కోరిక. పేదరికం లేని సమాజాన్ని చూడాలంటే… విద్యతోనే సాధ్యం.. దాన్ని టీచర్లే నెరవేర్చాలి. మగవాళ్లకంటే మహిళలే మంచిగా చదువు చెప్పగలరు. ఇంటిని కూడా మహిళలే చక్కగా తీర్చిదిద్దుతారు. అందుకే సంక్షేమ కార్యక్రమాలు అందించే విషయంలో మహిళలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాం. మహిళలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెచ్చాం. స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. దీపం పథకం అమలు చేస్తున్నాం. తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలున్నా.. వారందరికీ రూ. 15 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది. ప్రధాని సూపర్ జీఎస్టీ తెచ్చారు… ధరలు తగ్గించారు. దసరా, దీపావళి పండుగలను ఆనందంగా జరుపుకోవాలి. అభివృద్ధితో ఉద్యోగాలు వస్తాయి… ఆదాయం పెరుగుతుంది.. సంక్షేమం సజావుగా సాగించవచ్చు’ అని చంద్రబాబు అన్నారు.

విద్యా రంగాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు..

‘తొలిసారిగా సీఎం అయినప్పటి నుంచి విద్య పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాను. ఐటీ చదవమని ఆ రోజుల్లో చాలా మందికి చెప్పాను… కొందరు నా మాటపై నమ్మకంతో పట్టణాలకు వచ్చి చదువుకున్నారు. ఆ రోజు చక్కగా చదువుకున్నవారు… ఇప్పుడు విదేశాలకు వెళ్లారు.. బాగా స్థిరపడ్డారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రులందరూ కలిసి ఎంత మంది టీచర్లను నియమించారో… నేను ఒక్కడినే అంత మంది టీచర్లను నియమించాను. ఇదీ నేను విద్యా రంగానికి ఇచ్చే ప్రాధాన్యత. విద్యా రంగాన్ని నేను ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు.. నిర్లక్ష్యం చూపలేదు. టీచర్లుగా బాధ్యతలు తీసుకున్న మీరంతా బాగా పని చేయాలి… మంచి పేరు తీసుకురావాలి. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేలా టీచర్లంతా పని చేయాలి. విద్యా రంగంలో సంస్కరణలు తెస్తున్నాం… సన్న బియ్యంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. పేరెంట్-టీచర్ మీటింగులు నిర్వహిస్తున్నాం. మన బడి-మన భవిష్యత్ పేరుతో మౌళిక సదుపాయాల కల్పన చేపడుతున్నాం. టీచర్ల బదిలీల చట్టంతో పారదర్శకంగా ఒక్క ఫిర్యాదు కూడా లేకుండా టీచర్ల బదిలీలు పూర్తి చేశాం. నారా లోకేష్ నో బ్యాగ్ డే విధానం తెచ్చారు… ఇది వినూత్నంగా ఉంది. స్కూళ్లు తెరిచేలోగానే స్కూల్ కిట్లు, పుస్తకాలు ఇచ్చాం’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

 ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిరుద్యోగులు, ఈ ఏడాది డీఎస్సీలో క్వాలిఫై కాని వారంతా ప్రిపేర్ అవుతూ ఉండాలని సూచించారు. ఇకపై ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని… దాని కోసం ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి నారా లోకేష్ కు సీఎం చంద్రబాబు చెప్పారు. మెగా డీఎస్సీలో విజేతలకు ఉపాధ్యాయ పోస్టుల నియామక పత్రాలను జారీ చేసే కార్యక్రమం గురువారం రాష్ట్ర సచివాలయం సమీపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. డీఎస్సీలో టీచర్లుగా ఎంపికైన 15,941 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. అన్ని జిల్లాల నుంచి నియామక పత్రాలు అందుకునేందుకు కుటుంబ సభ్యులతో సహా కొత్తగా రిక్రూట్ అయిన టీచర్లు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పైనే పెట్టాను. అవినీతి లేకుండా పారదర్శకంగా డీఎస్సీ ప్రక్రియ చేపట్టాం… టీచర్ల నియమించాం. 150 రోజుల్లో ఈ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టిన మంత్రి నారా లోకేష్ బృందాన్ని అభినందిస్తున్నాను. ఇక టీచర్లుగా నియామక పత్రాలు తీసుకున్న ఉపాధ్యాయులను అభినందిస్తున్నాను. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా బాబు ష్యూరిటీ… జాబు గ్యారెంటీ అని చెప్పాను… దాన్ని నిజం చేస్తున్నాం. రూ. 10 లక్షల కోట్లు పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నాం.. 10 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. 15 ఏళ్లల్లో 14 సార్లు డీఎస్సీని పెట్టాం.. 1,96,619 ఉద్యోగాలిచ్చాం. ఇక పైనా ప్రతి ఏడాది డీఎస్సీ ఉంటుంది’ అని సీఎం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these