మాజీ మంత్రి ఆళ్లనాని తెలుగుదేశం పార్టీలో చేరి కొన్ని నెలలవుతుంది. అయినా సరే తెలుగు తమ్ముళ్లు మత్రం ఆయనను తమ నేతగా పరిగణించడం లేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆళ్ల నానికి ఆహ్వానం లేదు. ఇంతోటి దానికి పార్టీ మారడం ఎందుకు? టీడీపీలో చేరడం ఎందుకు ? అని నాని అనుచరులే ప్రశ్నిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆళ్ల నాని అనుచరులుగా ఉన్న వారిని కూడా టీడీపీ కార్యాలయం దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదట. ఏలూరు నియోజకవర్గం నేతలు ఎంతగా వ్యతిరేకిస్తున్నారో ఇప్పటికే ఆళ్ల నానికి అర్థమయి ఉంటుంది. అయితే ఆళ్ల నాని పార్టీని ఎందుకు వీడినట్లు? జగన్ ఇచ్చిన ప్రాధాన్యతను మరిచి అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్లింది ఎందుకు? అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి.
అసంతృప్తికి గురయి…
నిజానికి కి ఆళ్లనానికి ఇప్పటికిప్పుడు పార్టీ మారాల్సిన అవసరం లేదు. ఆయనను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం చర్యలకు కూడా దిగదు. ఎందుకంటే ఆయన సామాజికవర్గంతో పాటు ఆళ్లనాని అధికారంలో ఉన్నప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉండటమే కారణం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మంచి పదవులే లభించాయి. అసలు ఆళ్లనానిని ఎమ్మెల్సీ చేసింది జగన్. తర్వాత 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలి మంత్రివర్గంలోనే కీలకమైన వైద్య ఆరోగ్యశాఖను అప్పగించడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా అప్పగించారు. రెండో విడత విస్తరణలో మాత్రం ఆళ్ల నాని మంత్రి పదవిని కొనసాగించకపోవడంతో కొంత అసంతృప్తికి గురయ్యారు.అందువల్లనే పార్టీ మారినట్లు అనిపిస్తుందని భావించాల్సి వస్తుంది.
వైసీపీలో ఒక వెలుగు వెలిగి…
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆళ్ల నానికి ఏలూరు జిల్లాలో కూడా కీలక బాధ్యతలను జగన్ అప్పగించారు. కాపు సామాజికవర్గం నేత కావడంతో మంచి ప్రయారిటీ ఇచ్చారు. అయితే అదే అదనుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు పెట్టించడంలో ఆళ్ల నాని అత్యుత్సాహం చూపించారన్న విమర్శలున్నాయి. అయితే అది దిగువ స్థాయి నేతలపైనేనని అంటారు. ఆళ్ల నాని టీడీపీలో చేరే సమయంలోనే అనేక మంది అభ్యంతరాలు నేరుగా అధినాయకత్వానికి తమ అసంతృప్తిని తెలియజేశారు. అయినా నాయకత్వం అనేక అవసరాల దృష్ట్యా నాని మెడలో కండువా కప్పేసింది. ఇప్పుడు టీడీపీ నేతలంతా ఒక్కటయ్యారు. అందరూ దూరం పెట్టడటంతో ఏకాకిగా మారారు.
సింగిల్ గానే ఉంటూ…..
నిజానికి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆళ్ల నాని అవసరం టీడీపీకి లేదు. సీనియర్ నేతలు అనేక మంది ఉన్నారు. కాపు సామాజికవర్గ నేతలతో పాటు అనుభవమున్న లీడర్లు కూడా అక్కడ ఎన్నాళ్ల నుంచో ఉన్నారు. మరో వైపు జనసేన పార్టీ నుంచి కూడా బలమైన నేతలున్నారు. టీడీపీ, జనసేన నేతలను దాటుకుని టీడీపీలో రాజకీయంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎదగడం అంత సులువు కాదు. కానీ ఆళ్ల నాని సాహసం చేశారనే చెప్పాలి. పార్టీ మారిన తర్వాత ఆళ్ల నానిని పట్టించుకునే వారు లేరు. జనాలతో పాటు ఏ పార్టీ నేతలు ఆయనను కలవడానికి కూడా రాకపోవడంతో ఆయన ఒంటరిగానే కాలం వెళ్లబుచ్చుతున్నారు. అందుకే పార్టీ మారేటప్పుడు భవిష్యత్ ను చూసుకుని అడుగులు వేయాలంటారు. కానీ నాని మాత్రం ఏ ఆశించి మారారో కానీ, ప్రస్తుతం ఆయన సింగిల్ అయ్యారు.