‘కన్నప్ప’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ – KANNAPPA Review

‘కన్నప్ప’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ - KANNAPPA Review

Rating: 3.4/5

నటీనటులు: విష్ణు మంచు, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, శివ బాలాజీ, కౌశల్ మందా, బ్రహ్మనందం తదితరులు
దర్శకత్వం: ముఖేష్ కుమార్ సింగ్
కథ, స్క్రీన్ ప్లే: విష్ణు మంచు
నిర్మాత: మోహన్ బాబు
ఎడిటర్: ఆంథోని గన్సాల్వేజ్
సినిమాటోగ్రఫి: షెల్డాన్ ఛావు
మ్యూజిక్: స్టీఫెన్ డేవస్సీ
బ్యానర్స్: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2025-06-27

2వ శతాబ్దంలో ఉడుకూరు (ప్రస్తుత కాళహస్తి) ప్రాంతంలో గిరిజన యువకుడు తిన్నడు (విష్ణు మంచు)కు నాస్తికుడు. దేవుడంటే కోపం, అసహ్యం. దేలావుడిని పూజించే వారిని కూడా అసహ్యించుకొంటాడు. అలాంటి యువకుడు శివుడిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నెమలి (ప్రీతి ముకుందన్)‌ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. తన ప్రేమ కోసం గూడెం నుంచి బహిష్కరణకు గురవుతాడు. తిన్నడు ప్రేమ కోసం నెమలి కూడా తన గూడెంలోని అధికారాన్ని వదిలేసుకొని అతడిని పెళ్లి చేసుకొంటుంది. తిన్నడు, నెమలి సంసారంలోను శివలీల చిచ్చు పెడుతుంది. మహాశివరాత్రి రోజు తిన్నడిని నాస్తికుడి నుంచి ఆస్తికుడిగా మార్చి అతడి జీవితాన్ని మలుపుతిప్పుతుంది.

దేవుడంటే తిన్నడుకి ఎందుకు అంత కోపం? తన జీవితంలో చోటుచేసుకొన్న బాధలు, కష్టాలు ఎలా దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేశాయి. తిన్నడు జీవితంలోకి వచ్చిన కిరాత (మోహన్ లాల్) ఎవరు? కిరాత తిన్నడికి ఎలాంటి అనుభూతిని కలిగించాడు? వాయు లింగాన్ని సాధారణ భక్తులకు మహదేవ శాస్త్రి (మోహన్ బాబు) ఎందుకు దూరం చేశాడు? రుద్ర (ప్రభాస్) ఎవరు? రుద్ర ఎలాంటి పరిస్థితుల్లో తిన్నడు జీవితంలోకి వస్తాడు? తిన్నడిని ఎలా భక్తివైపు మరల్చేలా చేస్తాడు? నాస్తికుడి నుంచి ఆస్తికుడిగా, శివ భక్తుడిగా మారిన తిన్నడు ఎలాంటి త్యాగానికి పాల్పడ్డాడు. తన కళ్లను తిన్నడు ఎందుకు త్యాగం చేశాడు? తిన్నడి భక్తికి మెచ్చిన శివపార్వతులు (అక్షయ్ కుమార్, కాజల్) ఎలాంటి మోక్షాన్ని ప్రసాదించారు? అనే ప్రశ్నలకు సమాధానమే కన్నప్ప సినిమా కథ.

కన్నప్ప సినిమాను కల్పిత కథతో ఆస్తికరంగా దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మొదలుపెట్టి.. ఎమోషనల్ కంటెంట్‌తో కథలోకి తీసుకెళ్లిన తీరు బాగుంది. తిన్నడు నాస్తికుడిగా మారడానికి, బాల్యం నుంచే దేవుడిని అసహ్యించుకోవడానికి చూపే కారణాలను చాలా ఎఫెక్టివ్‌గా ఎస్టాబ్లిష్ చేయడంలో డైరెక్టర్ తన టాలెంట్‌ను చూపించాడు. ఇక అవ్రామ్, అరియానా, వివియానా, విద్యా పాత్రలను మలిచిన విధానం సినిమాకు కనెక్ట్ అయ్యేలా చేసింది. నెమలి (ప్రీతి ముకుందన్)తో తిన్నడు లవ్ స్టోరి కమర్షియల్ పాయింట్‌కు వర్క్ అయ్యేలా చేసింది. ఫస్టాఫ్‌కు అసలు కథకు సంబంధం లేకుండా సాగడం కొంత రెగ్యులర్, రోటిన్‌గా అనిపించినప్పటికీ.. కిరాత ఎంట్రీతో సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడు. కిరాత, తిన్నడు ఎపిసోడ్‌ సినిమా అత్యంత బలంగా మారింది. ఫస్టాఫ్‌ను కొంత ల్యాగ్‌ ఉంది అనే ఫీలింగ్ కలుగుతుంది.

ఇక కన్నప్ప సినిమాకు సెకండాఫ్ పీక్స్. రుద్ర ఎంట్రీతో కథా స్వరూపం మారిపోతుంది, ఎమోషనల్ కంటెంట్‌తో కథను మరింత భావోద్వేగంగా మార్చారు. రుద్ర క్యారెక్టర్‌లో ప్రభాస్‌ను కనెక్ట్ చేసి సినిమాను ఎవరూ ఊహించని రేంజ్‌లో పెట్టడంలో దర్శకుడు తన అనుభవాన్ని రంగరించారనే ఫీలింగ్ కల్పించాడు. ఇక చివరి 40 నిమిషాల్లో తిన్నడు పాత్రలో మంచు విష్ణు చూపించిన నటన, ప్రతీ సీన్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ అతడి కెరీర్‌కు బెస్ట్ అని చెప్పవచ్చు. విష్ణు తన కెరీర్‌లో అత్యున్నతమైన సినిమాను అందించాడనే చెప్పాలి. సెకండాఫ్‌లో స్క్రీన్ ప్లే అద్బుతంగా ఉంది. ప్రభాస్‌కు ఇచ్చిన ఎలివేషన్స్, అలాగే విష్ణు కంటతడి పెట్టించేంతలా చేసిన యాక్టింగ్, మోహన్ బాబు చివరగా కథకు ఇచ్చిన జస్టిఫికేషన్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్.

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మంచు విష్ణు వన్ మ్యాన్ షో. ఇప్పటి వరకు చూపించని నటనను ప్రదర్శించడమే కాకుండా.. ముఖ్యంగా ట్రోలర్స్‌‌కు తానేంటో,తన సత్తా ఏంటో చూపించి నోర్లు మూయించాడనే చెప్పొచ్చు. ఇక ప్రీతీ ముకుందన్ కేవలం గ్లామర్ పరంగానే కాకుండా యాక్టింగ్ పరంగా కూడా అదరగొట్టింది. జింక పిల్లలా స్క్రీన్ పే దూకిన తీరు ప్రీతీలోని ఎనర్జీని చూపించింది. ఇక మోహన్ లాల్, ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. విష్ణుపై ఉన్నభారాన్ని కొంత మేరకు షేర్ చేసుకొని స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. మోహన్ బాబు హుందాగా నటించారు. శరత్ కుమార్, మధుబాల, శివబాలాజీ, కౌశల్ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.

కన్నప్ప సినిమా మరో అత్యంత బలంగా కనిపించే అంశాలు మ్యూజిక్, సినిమాటోగ్రఫి. యాక్షన్ ఎపిసోడ్స్, లవ్ ట్రాక్, ఎమోషనల్ సీన్లకు, అలాగే మోహన్ లాల్, ప్రభాస్ ఎపిసోడ్‌లకు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. పలు సన్నివేశాలు రీ రికార్డింగ్‌తో లేపి పడేశాడు. ఇక న్యూజిలాండ్ అందాలను కథకు అన్వయించేలా చూపిస్తూ ఈ సినిమాను విజువల్ వండర్‌గా మార్చారు. ఎడిటింగ్ విషయంలో కొంత అసంతృప్తి ఉంటుంది. 15 నిమిషాల నిడివిని కట్ చేస్తే సినిమా పేస్ పెరుగుతుంది. ఈ సినిమాకు అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. గ్రాఫిక్ వర్క్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సి ఉందనిపిస్తుంది.

కన్నప్ప చిత్రం కేవలం భక్తి ప్రధాన చిత్రమే కాకుండా నేటి తరానికి కావాల్సిన కమర్షియల్ హంగులు పుష్కలంగా ఉన్న హై ఎమోషనల్ మూవీ. విష్ణు నభూతో నభవిష్యత్ అనే విధంగా నటించాడు. ప్రభాస్ ఈ సినిమాను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాడు. టెక్నికల్ వాల్యూస్ విజువల్ వండర్‌గా మార్చాయి. ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న చిత్రం. ఈ సినిమాను తప్పకుండా థియేటర్‌లోనే చూడండి. అన్నమయ్య, రామదాసు తర్వాత అంతటి అనుభూతిని కలిగించే చిత్రం కన్నప్ప. డోంట్ మిస్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these