మంచు విష్ణు కలల ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘కన్నప్ప’ శుక్రవారం విడుదలై తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. తరుచూ ట్రోలింగ్‌కు గురయ్యే మంచు ఫ్యామిలీకి ఈసారి సోషల్‌మీడియా నుండి సపోర్టే ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని వైఎస్ విజయమ్మ మంచు ఫ్యామిలీతో కలిసి గచ్చిబౌలి ఏఎంబీ మాల్‌లో వీక్షించారు. విజయమ్మ సినిమాలకు ఎక్కువగా వెళ్లరు. పైగా క్రిస్టియన్ అయిన ఆమె శివభక్తుడి కథతో రూపొందిన ఈ సినిమాను ప్రత్యేకంగా చూడటం చర్చనీయాంశమైంది.
మంచు ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘ కన్నప్ప ’ శుక్రవారం (జూన్ 27 ) ప్రపంచవ్యాప్తంగా రిలీజైన సంగతి తెలిసిందే. తొలి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో మేకర్స్ ఖుషీగా ఉన్నారు. సాధారణంగా మంచు ఫ్యామిలీపై సోషల్‌మీడియాలో ట్రోల్స్ గట్టిగా ఉంటాయి. అలాంటిది ఆ హీరోల నుంచి సినిమా వస్తుందంటే ట్రోలర్స్‌కి పండగే. అయితే ‘కన్నప్ప’ విషయంలో మాత్రం అది సాధ్యం కాలేదు. ‘కన్నప్ప’ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు ట్రోలింగ్ జరిగినా.. ఆ తర్వాత ఫస్ట్ లుక్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ రిలీజ్‌లతో నెగిటివీ అంతా పోయి పాజిటివిటీ బాగా పెరిగింది. దీంతో సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదిరిపోయాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో బ్రహ్మానందం మాట్లాడుతూ.. అవసరమైతే మంచు ఫ్యామిలీని ట్రోల్ చేయండి గానీ.. సినిమాని మాత్రం చంపేయొద్దని వేడుకున్నారు. ఆ ప్రభావం ‘కన్నప్ప’ఫై బాగానే చూపించినట్లు కనిపిస్తోంది.
‘కన్నప్ప’కు హిట్ టాక్ వస్తుండంతో మంచు విష్ణు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. చివరికి మంచు మనోజ్ కూడా తొలిరోజే సినిమా చూసి తాను అనుకున్న దానికంటే వెయ్యి రెట్లు అద్భుతంగా ఉందని, ప్రభాస్‌తో పాటు తన అన్న విష్ణు కూడా బాగా చేశాడని కితాబిచ్చాడు. ‘కన్నప్ప’కి మౌత్ టాక్ బాగుండటంతో రాబోయే రోజుల్లో థియేటర్లు కళకళలాడేలా కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రెటీలు కూడా కన్నప్ప టీమ్‌ని అభినందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఇక ఈ మూవీని చూసినవారైతే ఆకాశానికెత్తేస్తున్నారు.
తాజాగా ‘కన్నప్ప’ టీమ్‌ని మంచు ఫ్యామిలీతో కలిసి వైఎస్ ఫ్యామిలీ వీక్షించారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి తల్లి వైఎస్ విజయమ్మ తాజాగా ‘కన్నప్ప’ చిత్రాన్ని వీక్షించారు. మంచు విష్ణు భార్య వెరోనికా, ఇతర బంధువులతో కలిసి గచ్చిబౌలిలోని ఏఎంబీ మాల్‌కి వెళ్లిన విజయమ్మ ఈ చిత్రాన్ని చూశారు. షో అనంతరం ఆమె బయటకు వస్తుండగా నెటిజన్లు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా… ఆ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. స్వతహాగా క్రిస్టియన్ అయిన విజయమ్మ ఎక్కువగా బైబిల్ పట్టుకుని కనిపిస్తుంటారు. ఆమె ఎప్పుడూ సినిమాలకు వెళ్లినట్లుగా కూడా కనిపించరు. అయితే శివభక్తుడి కథాంశంతో తీసిన ‘కన్నప్ప’ చిత్రాన్ని ఆమె చూడటం చర్చనీయాంశంగా మారింది.
మంచు విష్ణు భార్య వెరోనికా.. విజయమ్మకు కూతురు వరుస అవుతారన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వెరోనికా తన బంధువులను ఆహ్వానించి ‘కన్నప్ప’ చిత్రాన్ని ప్రత్యేకంగా చూపించినట్లు తెలుస్తోంది. తన బిడ్డల మధ్య ఆస్తి పంచాయతీలతో సతమతమవుతోన్న విజయమ్మకు ‘కన్నప్ప’ మూవీ కాస్త కాలక్షేపం కలిగించే ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.