మాది మంచి ప్రభుత్వం… మెతక ప్రభుత్వం మాత్రం కాదు…సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

మాది మంచి ప్రభుత్వం… మెతక ప్రభుత్వం మాత్రం కాదు •

పిచ్చి పిచ్చి మాటలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం •

తలలు నరికేస్తాం… గొంతులు కోస్తాం అనే డైలాగ్స్ సినిమాల్లోనే బాగుంటాయ్•

అధికారం కోల్పోయినా వైసీపీ నాయకుల్లో మార్పు రాలేదు •

అప్పుడు ఎలాంటి అరాచకాలు చేశారో ఇప్పుడూ అలానే చేస్తున్నారు •

అధికార యంత్రాంగంపై బెదిరింపులకు దిగితే చట్టప్రకారం చర్యలు •

చట్టబద్ధంగా వ్యవహరించాలి కాబట్టి పద్ధతిగా మాట్లాడుతున్నాం •

గత వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులుపడ్డారు• రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు గాడిలో పెడుతున్నారు•

గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు సహకరిస్తున్నారు •

దివ్యాంగులకు పింఛన్లు, సామాజిక పింఛన్లు పెంచి ఆర్థిక భరోసా కల్పించాం•

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశాం•

ఏడాది కాలంలో రూ. 9.4 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం•

యోగాంధ్ర, గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించాం•

మరో 20 ఏళ్ళు వైసీపీ ఇక రాదు… రాబోదు •

‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ‘అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అరాచకాలు సృష్టించారో… ఇప్పుడూ అలాంటి విధానాలనే గత పాలకులు కొనసాగిస్తున్నారు. గొంతులు కోస్తాం… తలలు నరికేస్తాం వంటి బెదిరింపులకు, తాటాకు చప్పుళ్లకు భయపడేవారు ఎవరూ లేరు ఇక్కడ! పిచ్చిపిచ్చిగా మాట్లాడి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేద’ని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాది మంచి ప్రభుత్వం… మెతక ప్రభుత్వం మాత్రం కాదని స్పష్టం చేశారు.

శాంతిభత్రాలకు విఘాతం కలిగించేవారిని కచ్చితంగా కట్టడి చేస్తామని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో సోమవారం సాయంత్రం రాజధాని అమరావతిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురందేశ్వరి గారు, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయానంద్ గారితో కలిసి శ్రీ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “గత పాలకులు అధికారంలో లేకపోయినా రౌడీయిజం, అసాంఘిక విధానాల్లో ఏ మాత్రం మార్పురావడం లేదు. వాళ్లకు ప్రజాస్వామ్య విధానాలపై అసలు గౌరవమే లేదు. అధికార యంత్రాంగంపై బెదిరింపులకు దిగుతున్నారు. ఖండాలు దాటి వెళ్లినా పట్టుకొస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఇలా బెదిరించే వాళ్లకు మేము ఒకటే చెబుతున్నాం. ఇలాంటి తాటాకు చప్పుళ్లుకు బెదిరిపోయే వాళ్లు కూటమి ప్రభుత్వంలో ఎవరూ లేరు. మళ్లీ వైసీపీ వస్తే మా పరిస్థితి ఏంటి అనే ఆలోచన అవసరం లేదు. మరో 20 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. కూటమి ఐక్యతను చెడగొట్టే పరిస్థితుల్లో ఎవరూ లేరు. మరో 20 ఏళ్ల వరకు వైసీపీ ప్రభుత్వం రాదు… రావట్లేదు. సజ్జనుడికి కోపం వస్తే అడవి దహనం అవుతుంది. మాది మంచి ప్రభుత్వం మెతక ప్రభుత్వం కాదు. సమర్థవంతమైన ప్రభుత్వం… రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రభుత్వం. ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసి, ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలని చూస్తే ఉపేక్షించేది లేదు. అలాంటి వారిని తొక్కి నార తీస్తాం. మేం చట్టబద్ధంగా వ్యవహరించాలి కాబట్టి పద్ధతిగా మాట్లాడుతున్నాం. • కూటమి ప్రభుత్వం రాకుంటే ఏపీ ఏమయ్యేదో..?కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుంది. చాలా కష్టాలు, ఒత్తిళ్లు మధ్య పాలన చేపట్టాం. రాష్ట్ర విభజన జరిగినప్పుడు నుంచి ఆంధ్రప్రదేశ్ బాగుకోసం ఆలోచించాను. 2019లో ప్రభుత్వం మారిన వెంటనే విధ్వంస పాలన మొదలైంది. బూతులు తిట్టడం, భయపెట్టడం పరిపాటిగా మారింది. ప్రశ్నించే వారిని ఏదో ఒక నెపం పెట్టి జైల్లో పెట్టాలని చూశారు. ఏదైనా మాట్లాడదాం అంటే రౌడీమూకలు దాడులకు తెగపడేవారు. అధికార యంత్రాంగం భయం గుప్పెట్లో చిక్కుకుపోయింది. వీటన్నింటి మధ్య రాష్ట్రం విలవిలలాడిపోయింది. ఇలాంటివన్ని ప్రజాహితం కోరుకునే ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేసింది. వైసీపీ పాలనలో ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందిపడ్డారు. విశాఖపట్నంలో నన్ను బయటకు రానివ్వలేదు. యువగళం పాదయాత్ర సమయంలో మంత్రి శ్రీ లోకేష్ గారిని ఇబ్బంది పెట్టారు. చివరకు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని వదల్లేదు. వైసీపీ పాలన చూశాక రాష్ట్రానికి అసలు వెలుగు వస్తుందా? అని అనుకున్నా. కూటమి ప్రభుత్వం రాకుంటే రాష్ట్రం ఏమయ్యేదో అనిపించింది. ప్రజలకు సుపరిపాలన అందించాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఆశీర్వదించారు. కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. • ఆకలి తీరుస్తున్నాం… ఆర్థిక భరోసా కల్పిస్తున్నాం గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కేంద్రం నుంచి అందిస్తున్న సహాయ సహకారాలతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి పాలనా దక్షతతో, మంత్రివర్గ సహచరుల మద్దతుతో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047, వికసిత్ భారత్ లక్ష్యాల సాధన దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. యోగాంధ్రతో ప్రపంచ రికార్డు సృష్టించాం. ఆర్థిక పరిస్థితి అనుకూలించకున్నా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అధికారం చేపట్టిన వెంటనే గత ప్రభుత్వంలో రూ.3 వేలుగా ఉన్న పింఛనును రూ.4 వేలకు పెంచాం. దివ్యాంగులకు ఇచ్చే పింఛను రూ.3 వేల నుంచి రూ.6 వేలు చేశాం. తీవ్ర అనారోగ్యంతో మంచానికి పరిమితం అయిన వారికి రూ. 5 వేల నుంచి రూ.15 వేలకు పెంచి ఆర్ధిక భరోసా కల్పించాం. గత ప్రభుత్వం సామాజిక పింఛన్ల కోసం నెలకు రూ.1,939 కోట్లు వెచ్చిస్తే.. కూటమి ప్రభుత్వం రూ. 2,717 కోట్లు ఖర్చు చేస్తూ.. 63 లక్షల మందికి చేయూత ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 204 అన్న క్యాంటిన్లు ప్రారంభించి సగటున రోజుకు 3 లక్షల మంది ఆకలి తీరుస్తున్నాం. దీపం 2 పథకం ద్వారా తొలి విడత 1.15 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించాం. ఈ పథకం కోసం ఐదేళ్లలో రూ. 13,423 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయనున్నాము. వేట విరామ సమయంలో మత్స్యకారులకు అందించే భృతిని రెండితలు చేసి ఒక్కొక్కరికి రూ. 20 వేలు చొప్పున అందిస్తున్నాం.

• ప్రభుత్వ పథకాలకు మహనీయుల పేర్లు పెట్టాం గత పాలకుడు ప్రతి పథకానికి తన పేరో… లేకపోతే వారి తండ్రిగారి పేరో పెట్టేవారు. కూటమి పాలనలో మాత్రం ఎవరైతే సమాజానికి సేవ చేశారో వారి పేర్లను పథకాలకు పెడుతున్నాం. శ్రీ లోకేష్ గారి నేతృత్వంలోని విద్యా శాఖలో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాం. విద్యార్థుల స్కూల్ కిట్లుకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు పెట్టాం. తల్లికి వందనం పథకం ద్వారా 67 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూర్చాం. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరిట యువతను దగా చేస్తే … కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ 16,347 ఉపాధ్యాయ నియామకాలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశాం. 6,100 పోలీస్ ఉద్యోగాల నియామకాలకు చర్యలు తీసుకున్నాం. వైసీపీ హయాంలో ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకు వలస బాట పట్టగా, కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలబడ్డాం. ఏడాది కాలంలో బ్రాండ్ ఏపీని పునరుద్దరించడం ద్వారా రూ. 9.4 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. తద్వారా 6 లక్షల ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం అవుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్చించాం. గత ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్డీ, మైనారిటీల సబ్ ప్లాన్ నిధులను సైతం ఇష్టారాజ్యంగా మళ్లించి వెనుకబడిన వర్గాల వారికి ద్రోహం చేసింది. కూటమి ప్రభుత్వం సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం కాకుండా చర్యలు చేపట్టి ఆయా వర్గాల స్వయం ఉపాధి పథకాలకు వెచ్చిస్తోంది.• మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాం గత ఐదేళ్లలో గజానికో గుంతగా మారిన రాష్ట్ర రహదారులకు పునరుజ్జీవం నింపుతూ 20 వేల కి.మీ రోడ్లకు మరమ్మత్తులు చేశాం.

పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ బాధ్యతలు స్వీకరించిన వెంటనే సర్పంచులు తలెత్తుకునేలా చర్యలు తీసుకున్నాం. జాతీయ పండుగలైన స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ఇచ్చే నిధులను మైనర్ పంచాయతీలకు రూ.100 నుంచి రూ.10 వేలకు, మేజర్ పంచాయతీలకు రూ.250 నుంచి రూ.25 వేలకు పెంచాం. గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంలో భాగంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించాం. పల్లె పండుగ ద్వారా గ్రామీణ రహదారులకు కొత్త కళ తీసుకువచ్చాం. రైతులకు అండగా మినీ గోకులాలు, నీటి కుంటలు అనతి కాలంలోనే తవ్వించాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షల 94 వేల కుటుంబాల్లో 75 లక్షల 23 వేల మంది ఉపాధి శ్రామికులకు వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించాం.

2024- 2025 ఆర్ధిక సంవత్సరంలో 5.10 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని కల్పించాం. అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా గిరిజన గ్రామాలకు రహదారుల సౌకర్యం కల్పిస్తున్నాం. రూ. 1,005 కోట్లతో గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. డోలీ మోతలు లేని గిరిజన గ్రామాలు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. • అటవీ విస్తీర్ణం పెంచే దిశగా ప్రణాళికలు రాష్ట విస్తీర్ణంలో ప్రస్తుతం 30 శాతంగా ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 2029 నాటికి 37 శాతానికి పెంచే విధంగా ప్రణాళికలు రూపకల్పన చేస్తున్నాం. రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో ఏనుగుల బెడదను పరిష్కరించడానికి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి కుంకీ ఏనుగులను రాష్ట్రానికి తీసుకువచ్చాం. ఇప్పటికే నాలుగు కుంకీ ఏనుగులు పలమనేరు క్యాంపుకి చేరగా, మరో రెండు త్వరలో రానున్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణాని అరికట్టేందుకు కఠిన చర్యలు అమలు చేయడంతో పాటు అక్రమంగా తరలిపోతున్న ఎర్రచందనాన్ని తిరిగి తెచ్చుకునే విధంగా కర్ణాటక రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఏకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాం. రూ. 1,122 కోట్లతో 61 నగర వనాలను అభివృద్ధి చేస్తున్నాం. వన మహోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాం. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలోనూ విద్యార్ధులకు ప్రోత్సహకాలు అందించే విధంగా వేగంగా ముందుడుగు వేస్తున్నాం.

రూ. 308 కోట్లతో పిఠాపురం అభివృద్ధి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా గడచిన ఏడాది కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. ఏడాది కాలంలో రూ.308 కోట్లకుపైగా అభివృద్ధి పనులు చేపట్టాము. వచ్చే నాలుగేళ్లలో గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో, ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరింత ప్రగతి సాధిస్తాం” అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these