నేడు అహ్మదాబాద్‌కు ప్రధాని మోదీ..! మృతదేహాలకు DNA పరీక్ష అవసరమన్న అమిత్‌ షా..

నేడు అహ్మదాబాద్‌కు ప్రధాని మోదీ..! మృతదేహాలకు DNA పరీక్ష అవసరమన్న అమిత్‌ షా..

అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం సమీపంలో గురువారం సంభవించిన ఘోర విమాన ప్రమాదంలో 241 మంది మరణించారు. ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం టేకాఫ్ అయిన 32 సెకన్లలోనే కూలిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రమాద స్థలాన్ని సందర్శించనున్నారు. మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. గురువారం అహ్మదాబాద్‌లోని సర్దార్‌ పటేల్‌ ఎయిర్‌ పోర్ట్‌కు సమీపంలో ఎయిర్‌ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో ఏకంగా 241 మంది మరణించారు. వీరంత విమానంలో ఉన్నవారు మాత్రమే. అలాగే విమానం కూలిన బిల్డింగ్‌లో ఉన్న మెడికల్‌ విద్యార్థులు కూడా కొంతమంది మరణించారు. వారి సంఖ్య ఎంతనేది ఇంకా తేలాల్సి ఉంది. మొత్తం 230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలెట్లతో అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ విమానం టేకాఫ్‌ అయిన 32 సెకన్లలోనే ఎయిర్‌ పోర్ట్‌కు అతి సమీపంలో ఓ మెడికల్‌ కాలేజీ హాస్టల్‌ భవనంపై కుప్పకూలిపోయింది.

విమానం కూలిన వెంటనే భారీ పేలుడు సంభవించింది. దీంతో విమానంలో ఉన్న వారు అగ్నికి ఆహుతి అయ్యారు. కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే ఈ దుర్ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. శుక్రవారం అక్కడ పర్యటించి ప్రమాద స్థలిని పరిశీలించనున్నారు. కాగా ఈ ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. దీంతో మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు అవసరం అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. వీలైనంత త్వరగా అన్ని మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ఇప్పటికే హోం మంత్రి అమిత్‌ షా అహ్మదాబాద్‌కు చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అక్కడున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these