Andhra Pradesh: బ్లాక్‌ బర్లీ రైతులకు వర్రీ.. గిట్టుబాటు ధరలేక ఆందోళన

Andhra Pradesh: బ్లాక్‌ బర్లీ రైతులకు వర్రీ.. గిట్టుబాటు ధరలేక ఆందోళన

ఏపీలో పొగాకు రైతుల కష్టాలు తీరడం లేదు. అధికార, విపక్షాల మధ్య విమర్శల దాడి పెరుగుతుందే తప్ప.. కొనుగోళ్లు మాత్రం జరగడం లేదని.. పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్‌ ఈ నెల 11న.. పొదిలిలో పర్యటించనున్నారు.

ఏపీలో పొగాకు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. బ్లాక్ బర్లీ సాగు చేసిన రైతులు పంటకు గిట్టుబాటు ధర లేదంటున్నారు. ఎంతోకొంతకు అమ్ముకుందామని వెళ్తే.. గ్రేడింగ్ పేరుతో పొగాకు బేళ్లను వెనక్కి పంపుతున్నారని ఆవేదన చెందుతున్నారు. గిట్టుబాటు ధరకు పొగాకు కొనుగోళ్లు జరగడం లేదంటూ.. రైతు సంఘాల నేతలు కూడా మార్కెట్ యార్డుల్లో ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏడు కేంద్రాల్లో కొనుగోళ్లు జరుపుతామన్నా.. పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పొగాకు రైతులను పరామర్శించేందుకు సిద్ధమయ్యారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ఈ నెల 11న ప్రకాశం జిల్లా పొదిలి మార్కెట్‌ యార్డుకు జగన్ వెళ్తారు. రైతుల సమస్యలు తెలుసుకుంటారు.

పొగాకు కొనుగోళ్లపై ఇప్పటికే రివ్యూ చేసిన సీఎం చంద్రబాబు.. మార్క్‌ ఫెడ్‌కు 350 కోట్లు కేటాయించారు. సీఎం రివ్యూపై బ్రీఫింగ్ ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు.. రాష్ట్రవ్యాప్తంగా 80వేల మెట్రిక్ టన్నులకు పైగా పొగాకు పండిందన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనాలనీ సీఎం ఆదేశించారని చెప్పారు. పొగాకు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. 12వేలకు ధర తగ్గకుండా.. చివరి పొగా బేళ్ల వరకు ప్రభుత్వం కొంటుందని భరోసా ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు.

పొగాకు రైతుల పరిస్థితి ఏపీలో అరణ్య రోదనగా మారిందన్నారు మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు. జగన్ వస్తున్నారనే మొన్న ప్రెస్ మీట్‌ పెట్టి హడావుడి చేశారని, తర్వాత.. కొనుగోళ్లు జరగలేదని విమర్శించారు. కంపెనీలు సిండికేట్‌గా మారి.. రైతుల్ని మోసగిస్తున్నాయని చెప్పారు కారుమూరి. అంచనాలకు మించి నల్లబర్లీ పంటను పండించడంతోనే పొగాకు కొనుగోళ్లలో ఇబ్బందులు ఏర్పడ్డాయని ప్రభుత్వం చెబుతోంది. రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారించాలని సూచనలు చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these