ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది. పాలనా – పార్టీ పరంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. కేబినెట్ లో మార్పులు చేర్పులు తప్పవనే వాదన వినిపిస్తోంది. వైసీపీ లక్ష్యంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఏడాదిలో ఎమ్మెల్యేల పని తీరు.. అవినీతి ఆరోపణల వేళ చంద్రబాబు కీలక దిశా నిర్దేశం చేసారు. ఒన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
మార్పు రావాలి
పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలి కాన్ఫిరెన్స్ నిర్వహించారు. కూటమిపై ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించారని.. ఎమ్మెల్యేలు అందరూ అందుకు అనుగుణంగా నడుచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారనే విషయాన్ని ఎమ్మెల్యేలు గుర్తించాలని హెచ్చరించారు. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై నమ్మకాన్నిపెంచే విధంగా ఎమ్మెల్యేలు వ్యవహరించాలని నిర్దేశించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా సందర్భంగా జూన్ 12వ తేదీన అమరావతిలో 2 వేలమందితో ఓ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఎప్పుడూ చూడలేదు
రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించాలని సూచిం చారు. ఎమ్మెల్యేలు ఎవరెవరు ఏం చేస్తున్నారనే సమాచారం తన దగ్గర ఉందని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నేతలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎన్డీఏ కూట మి అధికారంలోకి వచ్చే నాటికి ఏపీలో ఉన్న పరిస్థితులు కూడా ప్రజలకు తెలియజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. 2024 జూన్‌కి ముందు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని గుర్తుచేశారు. తాను నాలుగోసారి సీఎం అయ్యానని.. కానీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదని చంద్రబాబు పేర్కొన్నారు. అయినా ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
కొనసాగిస్తాం
సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తున్నామని తెలిపారు. మనం రాష్ట్ర సంక్షేమం కోసం యజ్ఞం చేస్తుంటే రాక్షసులు కొంతమంది భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఏపీలో గతంలో గంజాయి విచ్చలవిడిగా లభ్యం అయ్యేదని.. ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నామని అన్నారు. శాంతి భద్రతలు, గంజాయి, రౌడీయిజాన్ని నిర్ధాక్షిణ్యంగా అణచి వేస్తామని.. ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వచ్చే నెల నాటికి పార్టీలో అన్ని కమిటీలు, రాష్ట్ర కమిటీలను నియామకం పూర్తి చేస్తామని తెలిపారు. యోగా డేను సక్సెస్ చేయాలని సూచించారు. కార్యకర్తలు యోగా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.