ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు దీర్ఘకాలిక లక్ష్యాలతో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేశారు. అంతే కాదు దీన్ని అమల్లో కూడా పెట్టేశారు. ‘స్వర్ణాంధ్ర -2047’ విజన్ అమలుకు మరింత ఊతం ఇచ్చేలా ఇవాళ చంద్రబాబు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేసిన ఆఫీసుల్ని ప్రారంభించారు. ఒక్కో కార్యాలయ నిర్వహణకు రూ.10 లక్షలు కేటాయించారు. 26 జిల్లా, 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లుగా వీటిని అభివర్ణిస్తున్నారు.
జిల్లా, నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాల ఏర్పాటుతో స్వర్ణాంధ్ర-2047 విజన్ సాకారానికి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకటించారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయం లేదని…ఇప్పుడు విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ల ఏర్పాటుతో ఆ లోటు తీరిందన్నారు. కార్యాలయం ఏర్పాటుతో పాటు 9 మందితో టీమ్ కూడా ఇస్తున్నామని, ఇక విజన్ అమలును తర్వాత స్థాయికి తీసుకువెళ్లాల్సింది మీరేనని ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అధికారులకు తెలిపారు.
ఎమ్మెల్యేలకు ఇది ఒకమంచి అవకాశమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల్ని భాగస్వాముల్ని చేయాల్సిందిగా సీఎం సూచించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 అమలుపై వారితో చర్చించారు. జిల్లా, నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయన్నారు. నియోజకవర్గ యాక్షన్ ప్లాన్ యూనిట్‌కు ఎమ్మెల్యే అధ్యక్షుడిగా ఉంటారని, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ కార్యనిర్వహణ ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, మున్సిపాలిటీ / నగర పంచాయతీ ఛైర్మన్, ఆర్డీఓ/సబ్ కలెక్టర్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు సభ్యులుగా ఉంటారన్నారు. నియోజకవర్గ కేంద్రానికి చెందిన ఎంపీడీవో కన్వీనర్‌గా వ్యవహరిస్తారన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్-2047కు అనుబంధంగా రాష్ట్రంలో ‘స్వర్ణాంధ్ర-2047’ విజన్ రూపొందించుకున్నట్లు సీఎం తెలిపారు. 4వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ ఇటీవల మారిందని, రెండేళ్లలో 3వ స్థానం చేరుకుంటామని తెలిపారు. పేదరికం లేని సమాజం, ఉద్యోగ కల్పన, నైపుణ్యం-మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయ సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు-బ్రాండింగ్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్..ఇలా 10 ప్రధాన సూత్రాలతో కార్యాచరణ నిర్దేశించుకున్నట్లు సీఎం తెలిపారు.
‘వాట్సప్ గవర్నన్స్ ద్వారా 400కి పైగా ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని, వచ్చే 2 నెలల్లో మొత్తం ప్రభుత్వ సేవల్ని మన మిత్రతో పొందవచ్చన్నారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, సచివాలయ స్థాయిల్లో విజన్ అమలు ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ‘హెల్తీ, వెల్తీ, హ్యాపీ’ రాష్ట్రంగా ఉండాలనేది అంతిమ లక్ష్యమన్నారు. రాష్ట్రంతో పాటు 26 జిల్లాలకు విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు సిద్ధం చేశామని, విజన్ యాక్షన్ ప్లాన్ పర్యవేక్షణ, అమలుకు ప్లానింగ్ విభాగం, జీఏడీ, ఐటీఈ &సీ, ఆర్టీజీఎస్, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, ఫైనాన్స్, ఐ&పీఆర్, సీఎంఓ కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. 26 జిల్లాలకు గాను 5 ఏళ్ల రోడ్‌మ్యాప్ రూపొందించామన్నారు. లక్ష్యాలను సాధించడం కోసం యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.