ఎండీయూ వాహనాల తొలగింపు దారుణంప్రభుత్వ నిర్ణయంతో రోడ్డున పడ్డ 18,600 కుటుంబాలు ఇంకా రెండేళ్లు కాల పరిమితి ఉన్నా ఎందుకు తొలగించారు టీడీపీ కార్యకర్తలకు షాపులు కేటాయింపు కోసమే ఈ కుట్ర షాపుల కేటాయింపులోనూ ఎమ్మెల్యేలు లక్షలు డిమాండ్ చేస్తున్నారట ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుని ఇదేం పని హామీలు నెరవేర్చలేదు సరికదా..ప్రతి వర్గాన్ని దెబ్బతీస్తున్న వైనం హైకోర్టును ఆశ్రయించాం .. మూడు వారాలు గడువు కోరిన ప్రభుత్వం న్యాయ పోరాటం కొనసాగిస్తాం .. అండగా నిలబడతాం ఎండీయూ ఆపరేటర్ల నిరసన ర్యాలీలో మాజీ ఎంపీ భరత్
సరుకులను నేరుగా ఇంటికే చేర్చాలన్న మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నప్పటికీ ఎందుకు తొలగించాల్సి వచ్చిందని మాజీ ఎంపీ, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ప్రశ్నించారు. ప్రజల ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ఎండీయూ ( మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ ) రేషన్ పంపిణీ చేసే వాహనాలను గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుచేయడం వలన మంచి ఫలితాలు వచ్చాయని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ, ఎండీయూ ఆపరేటర్ల జిల్లా యూనియన్ ఆధ్వర్యాన మెయిన్ రోడ్డులో శనివారం ర్యాలీ నిర్వహించారు.
రేషన్ వాహనాల డ్రైవర్లు, హెల్పర్లు పాల్గొన్న ఈ ర్యాలీలో మాజీ ఎంపీ భరత్ కూడా పాల్గొని సంఘీభావం తెలిపారు. ఏపీ ఎండీయూల ఐక్యత వర్ధిల్లాలి, కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, మాకు న్యాయం చేయాలి అంటూ నిరసన కారులు నినదించారు. ఈ సందర్బంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన గత నాలుగు సంవత్సరాలు కాలంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18,600 మంది ఎండీయూ వ్యాన్లపై ఆధారపడి జీవిస్తున్నారని గుర్తుచేశారు. నేరుగా రేషన్ ఇంటికి చేర్చే విధానంతో చాలామంది వృద్ధులు, మహిళలు ఎంతో ఆనందంగా ఉన్నారని ఆయన అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం జూన్ 1 నుంచి ఎండీయూ వ్యాన్లు తొలగిస్తున్నట్లు ప్రకటించడంతో వాటిపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 9,300 మంది నిరుద్యోగులు గా రోడ్డున పడ్డారని భరత్ ఆవేదన చెందారు.
కూటమి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఎండీయూ ఆపరేటర్లకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 2027 వరకు ఎండీయూ వ్యాన్లు నిర్వహించుకునేందుకు అనుమతులు ఉన్నప్పటికీ ఉన్నఫళంగా తొలగించడం దారుణమన్నారు. ఇప్పటికే ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించి లంచ్ మోషన్ మూవ్ చేసినట్లు భరత్ ప్రస్తావించారు. హైకోర్టు కూడా వివరణ కోరిందని, అయితే ప్రభుత్వం తరపున పెద్దఎత్తున లాయర్లు కోర్టుకి వచ్చి, ఇది ప్రభుత్వ విధానమని, ఖర్చు ఆదా అవుతుందని, అందుకే మూడు వారాలు గడువు కావాలని కోరారని, అయితే లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశిస్తూ ప్రభుత్వానికి మూడువారల గడువు ఇచ్చిందని ఆయన వివరించారు. న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఎన్నికల ముందు ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక హామీలు నెరవేర్చడం లేదు సరికదా ప్రతి వర్గాన్ని దెబ్బతీసేలా నిర్ణయాలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని భరత్ ఎద్దేవా చేశారు.
ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతోందని, అయితే ఏ వర్గం ప్రజలు అయినా సంతోషంగా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. తల్లికి వందనం అని చెప్పి , ప్రతి తల్లికి పంగనామం పెట్టారని, విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామని చెప్పి ఇంతవరకు చేయలేదని భరత్ విమర్శించారు. పెట్టేవాళ్లమే తప్ప కడుపులు కొట్టేవాళ్ళం కాదని పదేపదే చెప్పిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లను పక్కన పెట్టేశారని ఆయన ధ్వజమెత్తారు. వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలన్నారు. వాలంటీర్లకు పదివేలు జీతం ఇస్తామని చెప్పి ఏమిచేశారని ఆయన నిలదీశారు. రేషన్ డీలర్లకు ఎండీయూ ఆపరేటర్లు ఒక చెక్ గా ఉన్నారని, అలాగే ఎండీయూ ఆపరేటర్లు అక్రమాలు చేస్తే రేషన్ డీలర్లు అడ్డుకుంటారని ఇలా ఒకరికొకరు అవకతవకలు చేయకుండా ఉండేదని అయితే ఇప్పుడు ఎండీయూ ఆపరేటర్లను తీయడం వలన చెక్ పోయిందని భరత్ అన్నారు. 29వేలమంది రేషన్ డీలర్లు ఉండగా, మరో ఆరువేలమందిని కొత్తగా తీసుకుంటున్నారని, అయితే తెలుగుదేశం నాయకులు, అనుయాయులకు కట్టబెట్టడానికి ఎమ్మెల్యేలు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ, జేబులు నింపుకునే కార్యక్రమాలు చేస్తున్నారని భరత్ ఆరోపించారు. ఒక్కొక్క రేషన్ డిపోకు ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి కూడా వచ్చిందన్నారు. దీన్ని బట్టి ఎమ్మెల్యేలు ఎక్కడా వదలకుండా ఎక్కడబడితే అక్కడ దోచుకునే వ్యవస్థను ఇంతవరకు ఎక్కడా చూడలేదని భరత్ వాపోయారు. ఎండీయూ ఆపరేటర్లకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తూ ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడడం దారుణమన్నారు. ఎండీయూ ఆపరేటర్లు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని, న్యాయం జరిగేవరకు పోరాడతామని చెప్పారు. రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిల రెడ్డి, వైయస్ఆర్ సీపీ మాజీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్, వైయస్ఆర్ సీపీ కార్మిక నాయకుడు వాసంశెట్టి గంగాధరరావు, సప్ప ఆది నారాయణ, వైయస్ సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్, వైసీపీ నాయకులు మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, సంకీస భవాని ప్రియ, బిల్డర్ చిన్న, ముప్పన శీను, తిరగాటి దుర్గ, గుడాల ప్రసాద్, సాల సావిత్రి, అనంతలక్ష్మి, అను యాదవ్, కృష్ణవేణి, అనురాధ, ఎండీయూ ఆపరేటర్ల యూనియన్ నాయకులు అరె చిన్ని, గారా శ్రీనాథ్, వైయస్ఆర్ సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.