ఈసారి మహానాడులో 6 తీర్మానాలపై చర్చించనుంది టీడీపీ. దీంతోపాటు మరో సంచలన తీర్మానం కూడా చేయనున్నారా? పార్టీ నేతలు హింట్ ఇస్తోంది దాన్ని గురించేనా? మహానాడులో తీసుకోబోయే ఆ మహా నిర్ణయం ఏంటి? చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు.. అనేది ఉత్కంఠగా మారింది.
కడప గడపలో గ్రాండ్‌గా షురూ కానుంది టీడీపీ మహానాడు.. పసుపు పండుగకు ఇప్పటికే టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివెళ్లారు. ఇక ఈ మహానాడులో కార్యకర్తే అధినేత, మై టీడీపీ యాప్, తెలుగు జాతి-విశ్వఖ్యాతి, స్త్రీశక్తి, సామాజిక న్యాయం-పేదల ప్రగతి, అన్నదాతకు అండ.. ఇలా మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించిన సూపర్ సిక్స్ అంశాలపై మహానాడులో చర్చించి తీర్మానాలు చేయనున్నారు. మరోవైపు మంత్రి నారా లోకేష్‌కి పార్టీ పగ్గాలు అప్పగించాలనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. సీనియర్ నేతలు, మంత్రులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మహానాడులో మరో మహా తీర్మానం చేసే అవకాశం ఉంటుందా?
వాయిస్: ఇక యువగళం పేరుతో ఒకరు, యువతకు ప్రాధాన్యం పెంచాలంటే పార్టీ పగ్గాలు లోకేష్ చేతుల్లో పెట్టాలని మరొకరు, ఇలా పార్టీలో అంతా సానుకూల వాతావరణమే కనిపిస్తోంది. వినిపిస్తోంది. లోకేష్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనే డిమాండ్లు నేతల నుంచి వస్తున్నాయి. దీనిపై పార్టీలో ఏకాభిప్రాయం ఉంది. మరి దీనికి సంబంధించిన తీర్మానం అనుకూలంగా ఉంటుందేమో చూడాలంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ నేపథ్యంలో..పాత తరానికి రెస్ట్ ఇస్తూ…. పార్టీకి యువ రక్తం ఎక్కించాలంటున్నారు మంత్రి డోలా. యువతకు ప్రాధాన్యత కోసం యువ గళం రావాలని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అభిప్రాయపడ్డారు.
ఆరు ప్రధాన అంశాలపై చర్చలు
మహానాడులో మొదటి రెండు రోజులు ప్రతినిధుల సభగా, మూడవ రోజు ఐదులక్షల మందితో భారీ బహిరంగ సభగా నిర్వహించనున్నారు. ఈసారి మహానాడు కార్యాచరణ “కార్యకర్తే అధినేత”, “యువగళం”, “స్త్రీ శక్తి”, “సామాజిక న్యాయం”, “అన్నదాతకు అండ”, “తెలుగు జాతి – విశ్వ ఖ్యాతి” అనే ఆరు సూత్రాల చుట్టూ కొనసాగనుంది. ఇందులో ప్రతి అంశంపై విస్తృతంగా చర్చించి తీర్మానాలు తీసుకోనున్నారు.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా నివేదిక ఇవ్వనున్న లోకేష్
తొలి రోజు ఉదయం 10.45 గంటలకు ప్రారంభం కానున్న ప్రతినిధుల సభలో లోకేష్ పార్టీ కార్యకలాపాలపై నివేదిక సమర్పించనున్నారు. అనంతరం చంద్రబాబు ప్రసంగం సాగనుంది. పార్టీ ధ్యేయాలు, భవిష్యత్ మార్గదర్శకంపై స్పష్టత ఇవ్వనున్నారు సీఎం. మధ్యాహ్నం సీఎం నారా చంద్రబాబు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నుకోవడానికి నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే సమయంలో లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టే ప్రకటన జరిగే అవకాశం ఉంది.
లోకేష్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనే డిమాండ్‌ను, టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామంటున్నారు మరికొందరు నేతలు. మొత్తానికి ఈసారి మహానాడులో పార్టీ పగ్గాల విషయంలో టీడీపీ హై కమాండ్ మహా నిర్ణయం తీసుకుంటుందో లేదో చూడాలి.