విజయవాడ తిరంగా ర్యాలీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు….

పాకిస్థాన్ మన దేశంలోకి వచ్చి కొడితే… మనం వారి ఇళ్లలోకి వెళ్లి కొడతాం

  • మన దేశాభివృద్ధిని చూసి ఓర్వలేకే పాకిస్థాన్ ఉగ్రవాదులతో దాడులు చేయిస్తోంది
  • దేశ విభజన జరిగిన నాటి నుంచి ప్రశాంతత లేకుండా చేస్తోంది
  • శాంతివచనాలు వారికి పనికి రావు… ఇక పాకిస్థాన్ ఆటలు సాగవు
  • క్లిష్ట పరిస్థితుల్లో మనమంతా సైన్యానికి మేమున్నామన్న ధైర్యం ఇవ్వాలి
  • సైన్యాన్ని కించపరచే సూడో సెక్యులరిస్టుల నోరు మూయించాలి
  • సెలబ్రిటీలు వినోదాన్ని మాత్రమే పంచుతారు… దేశాన్ని నడపరు
  • విజయవాడ తిరంగా ర్యాలీలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
  • ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో కలసి పాల్గొన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు

‘భారత దేశ అభివృద్ధిని చూసి ఓర్వలేకే పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషించి దాడులకు పాల్పడుతోంద’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. 1947లో దేశ విభజన జరిగిన నాటి నుంచి దేశం ఏనాడు ప్రశాంతత చూసింది లేదన్నారు. శాంతి.. శాంతి అంటూ వల్లించే శాంతి వచనాలు వారికి పని చేయవన్నారు. ఇప్పటి వరకు సహనంతో మా చేతులు కట్టేశారు. ఇక పాకిస్థాన్ ఆటలు సాగవన్నారు. మీరు మా దేశంలోకి వచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి వచ్చి కొడతామని హెచ్చరించారు.

శుక్రవారం ఆపరేషన్ సిందూర్ విజయానికి మద్దతుగా విజయవాడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురందేశ్వరి గారు, రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలసి పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు జాతీయ జెండా చేతబూని రెపరెపలాడిస్తూ సూమారు మూడు కిలోమీటర్లు నడిచారు. ఆద్యంతం జాతీయ భావం వెల్లివిరియగా.. వేలాది మంది నగర ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొని భారత సైన్యం తాలూకు శౌర్యాన్ని కీర్తించారు. భారత్ మాతా కీ జై అని నినదిస్తూ గౌరవ ముఖ్యమంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రివర్యులు ముందుకి కదలగా వేలాది మంది జాతీయ పతాకాలు చేతబూని వారిని అనుసరించారు.

బెంజి సర్కిల్ వద్ద ర్యాలీ ముగిసిన అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “తిరంగా యాత్రకు మద్దతు తెలుపుతున్న సమస్త ప్రజానీకానికి నమస్కారాలు. దేశ విభజన జరిగిన నాటి నుంచి మనం ఏనాడు ప్రశాంతత చూడలేదు. కసబ్ లాంటి తీవ్రవాదులు దేశంలోకి చొరబడి 72 గంటల పాటు ఎలాంటి దాడులు చేశారో చూశాం. ముంబయి పేలుళ్లు, కోయంబత్తూరు పేలుళ్లు, గోకుల్ చాట్ పేలుళ్లు, జామా మసీదు పేలుళ్లు, లుంబనీపార్కు పేలుళ్లు వీటన్నింటి వెనుక పాకిస్థాన్ హస్తం ఉంది.

  • సెలబ్రిటీలు దేశాన్ని నడపరు…
    మనం ఈ రోజు విజయవాడ నడిబొడ్డున కూర్చుని మాట్లాడుతున్నామంటే అది సరిహద్దుల్లో మన సైనికులు ఉన్నారన్న ధైర్యమే. అదే సరిహద్దు రాష్ట్రాలు అయిన జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, హర్యానా… అక్కడ ఇంత ప్రశాంతత ఉండదు. మన దేశానికి మనం చేయగలిగింది ఒకటే. సైన్యానికి మనం అండగా ఉన్నాం అని ధైర్యం చెప్పడమే.
  • దేశం లోపల ఉన్న సూడో సెక్యులరిస్టులు సెక్యులరిజం ముసుగులో దేశ సైన్యాన్ని బలహీనపరిచే విధంగాగాని, కించపరిచే విధంగాగాని వ్యాఖ్యలు చేస్తే… ఆ వ్యాఖ్యలు చేసిన వారు ఏ స్థాయి వ్యక్తులైనా వారికి బలమైన జవాబు చెప్పి వారి నోరు మూయించడం మనందరి కర్తవ్యం. మన సైన్యం కోసం మనం బలంగా నిలబడాలి.
  • శ్రీ మురళీ నాయక్ 23 ఏళ్ళ కుర్రాడు. భారత్ మాతాకీ జై చెప్పారు. అటువంటి వారే నిజమైన దేశ భక్తులు.
    సెలబ్రిటీలు, హీరోలు ఎవరూ మాట్లాడడం లేదు అంటే వారెవరూ దేశాన్ని నడిపేవారు కాదు. వారు వినోదాన్ని పంచే వారు మాత్రమే.. సెలబ్రటీస్ నుంచి అంతకు మించి దేశభక్తి ఆశించకండి.
  • దేశభక్తుడు అంటే మురళీ నాయక్ లాంటి వారు. మరణిస్తే దేశాన్ని కాపాడుతూ సైనికుడిగా పోవాలి అనుకున్నారు. అతని తల్లిదండ్రులకు ఏం చెప్పగలం. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన శ్రీ మురళీనాయక్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. మురళీ నాయక్ అమర్ హై..” అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, కూటమి పక్షాలకు చెందిన మంత్రులు, శాసన సభ్యులు, మూడు పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these