భారీ వర్షం ధాటికి పెచ్చులూడిన చార్మినార్‌… భాగ్యలక్ష్మి ఆలయం వైపు పడిన పెచ్చులు

భారీ వర్షం ధాటికి పెచ్చులూడిన చార్మినార్‌… భాగ్యలక్ష్మి ఆలయం వైపు పడిన పెచ్చులు

హైదరాబాద్‌లో గురువారం వర్షం దంచికొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. చార్మినార్‌ ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. వర్ష ప్రభావం కారణంగా చారిత్రక కట్టడం చార్మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భాగ్యలక్ష్మి దేవాలయం వైపున ఉన్న మినార్‌లో పై కప్పు నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారాయి. గతంలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఇదే మినార్‌ పైభాగం నుంచి పెచ్చులు ఊడిపడిన విషయాన్ని స్థానికులు గుర్తు చేస్తున్నారు.

చార్మినార్ కు నాలుగు మినార్‌లు ఉండగా, వాటిలో ఓ మినార్‌కు పగుళ్లు ఏర్పాడ్డాయి. గతంలో ఒక మినార్ పెచ్చులు ఊడి నేలపై పడిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు కట్టడాన్ని పరిశీలించారు. అనంతరం మరమ్మతు చర్యలు చేపట్టారు.

గోల్కొండ పాలకుడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో చార్మినార్ ను నిర్మించారు. క్రీస్తుశకం 1591లో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా ఈ కట్టడాన్ని నిర్మించినట్లుగా చెబుతారు. చార్మినార్‌కి ఇలా పెచ్చులూడటం ఇదే తొలిసారి కాదు. గత 20-30 సంవత్సరాల్లో అనేకసార్లు చార్మినార్ నుంచి పెచ్చులు ఊడి పడ్డాయి.

నిజానికి చార్మినార్ ప్రధాన కట్టడానికి సమస్య లేకపోయినా, చుట్టూ ఉండే సున్నపు మిశ్రమంతో చేసిన అదనపు నిర్మాణాలు కొంత కాలంగా దెబ్బతింటూ వస్తున్నాయి. భారత పురావస్తు శాఖ దీనికి మరమ్మతులు చేపడుతూనే ఉంది. అయితే తాజాగా కురిసిన భారీ వర్షానికి పెచ్చులు ఊడిపడటం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these