TDP : క్యాడరే కాదు.. ఎమ్మెల్యేల్లోనూ ఇంత అసంతృప్తి ఎందుకో? వెంకట్రావు ఓపెన్ అయిపోయారుగా

TDP : క్యాడరే కాదు.. ఎమ్మెల్యేల్లోనూ ఇంత అసంతృప్తి ఎందుకో? వెంకట్రావు ఓపెన్ అయిపోయారుగా

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటుతుంది. అయితే ఇప్పటికే క్యాడర్ లో ఒకరకమైన అహసనం కనపడుతుంది. తమకు ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కించడమేంటని క్యాడర్ సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలతో కొందరు కుమ్మక్కై వెనకాడుతున్నారని కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమపై గత ప్రభుత్వంలో తప్పుడు కేసులు నమోదు చేసిన వారిపై ఇప్పటి వరకూ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సోషల్ మీడియా వేదికగా తెలుగు తమ్ముళ్లు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. అయితే చట్ట ప్రకారమే చర్యలకు దిగుతామని చంద్రబాబు పదే పదే చెబుతున్నా తమ్ముళ్లు మాత్రం తొందరపడుతున్నారన్న టాక్ వినపడుతుంది.

సీరియస్ గా తీసుకున్నా…

ఇదిలా ఉండగానే ఎమ్మెల్యేలు కూడా అసహనం వ్యక్తం చేస్తుండటం పార్టీని ఇరకాటంలోకి నెట్టేసింది. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీ వేదికగా చేసిన కామెంట్స్ పార్టీలో కాక రేపుతున్నాయి. యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యలను పార్టీ అగ్ర నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. ఏదైనా ఉంటే ఇటువంటి విషయాలు అంతర్గతంగా మాట్లాడాలి తప్పించి ఇలా అసెంబ్లీలో మాట్లాడటేమేంటని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అసెంబ్లీలో యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యామన్న ఆనందం లేదని, తమ పనులు ఒక్కటి కూడా జరగడం లేదని, ఎందుకు ఎన్నికయ్యామో కూడా అర్థం కావడం లేదని వెంకట్రావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

డీసీసీ బ్యాంకులో …

యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జిల్లా డీసీసీబీ బ్యాంకు ఛైర్మన్ గా పనిచేశారు. ఆ సమయంలో అనేక సంస్కరణలను చేపట్టారు. అయితే ఆయన తర్వాత వైసీపీకి రాజీనామా చేసి యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరిపోయారు. వెంకట్రావు రాజీనామా చేసిన తర్వాత బ్యాంకులో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. పెద్దయెత్తున అవినీతి జరిగిందని యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి రావడంతో వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. కానీ కొన్ని నెలలు గడుస్తున్నా అధికారులు డీసీసీబీలో జరిగిన అవకతవకలపై విచారణ జరపకపోవడంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఉన్నతాధికారుల తప్పిదమా? లేక అగ్రనేతల నిర్లక్ష్యమా? అన్నది తేలకుండా ఉంది.

యార్లగడ్డ మాత్రమే కాదు…

ఇది ఒక యార్లగడ్డ వెంకట్రావు మాత్రమే కాదు టీడీపీలో ఉండి గత ప్రభుత్వంలో కేసులు నమోదు చేయించుకుని, జైలుకు వెళ్లి వచ్చిన వారు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. చట్టం పేరుతో కాలయాపన చేస్తూ పోతుంటే క్యాడర్ లో తాము పలచన అవ్వక తప్పదని వారు చెబుతున్నారు. రాయలసీమలోని కొందరు ఎమ్మెల్యేలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా మంత్రుల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే తొందరపడవద్దని వరసగా వేధించిన వైసీపీ నేతలపై కేసులు నమోదు చేస్తామని బుజ్జగించి పంపుతున్నారు. దీంతో టీడీపీలో ఇటు క్యాడర్ తో పాటు అటు ఎమ్మెల్యేలు కూడా పెల్లుబుకుతున్న ఆగ్రహంపై నీళ్లు చల్లాల్సిన అవసరం అధినాయకత్వంపై ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these