Akhilapriaya : అఖిలప్రియ చుట్టూ అంత మంది శత్రువులు ఎందుకున్నారో తెలుసా?

అఖిలప్రియ చుట్టూ అంత మంది శత్రువులు ఎందుకున్నారో తెలుసా?

మాజీమంత్రి అఖిలప్రియ నిత్యం కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు. ఎవరికైనా ప్రత్యర్థి పార్టీల నుంచి శత్రువులుంటారు. కానీ అఖిలప్రియకు మాత్రం శత్రువులందరూ సొంత వాళ్లే. వాళ్లతో ఈమె శతృత్వం పెంచుకుంటుందో లేక అఖిలప్రియతో వాళ్లు విభేదిస్తున్నారో తెలియదు కానీ సొంత పార్టీ నేతలే ఆమెకు ఇబ్బందికరంగా మారారు. ఆళ్లగడ్డ తన సొంత అడ్డా అని భావించిన అఖిలప్రియకు 2019 ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. అయితే ఆ ఓటమికి గల కారణాన్ని అఖిల ప్రియ విశ్లేషించుకోకుండా ఈసారి గెలిచిన తర్వాత కూడా అదే పంథాను కొనసాగిస్తుండటంతో పరిస్థితి మారలేదు. తండ్రి, తల్లి కి ఉన్న బంధాలను కావలని తెంచుకున్నట్లే కనపడుతుంది. ఒంటరిపోరు చేయడానికే అఖిలప్రియ ఇష్టపడుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.

అందరినీ దూరం చేసుకుని…

భూమా శోభానాగిరెడ్డి, నాగిరెడ్డితో అనుచరులు, బంధువులను అఖిలప్రియ ఇప్పటికే దూరం చేసుకున్నారు. సొంత బంధువులను కూడా ఆమె దగ్గరకు రానివ్వడం లేదు. కనీసం వారి పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అఖిలప్రియ 2014లో తల్లి మరణంతో ఆమె రాజకీయాల్లోకి చిన్న వయసులో అడుగు పెట్టారు. వెంటనే ఏకగ్రీవంగా ఆళ్లగడ్డకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత తన తండ్రి భూమా నాగిరెడ్డితో కలసి ఆమె టీడీపీలో చేరారు. నాగిరెడ్డి మరణంతో అఖిలప్రియను మంత్రి పదవి వరించింది. అప్పటి నుంచి ఆమె వ్యవహార శైలి మారింది. మంత్రి పదవిలో ఉన్నంత కాలం అయిన వారిని కూడా కాల్చుకుతిన్నారన్న పేరు పొందడంతో 2019 ఎన్నికలలో ఓటమి పాలు కావాల్సి వచ్చింది.

ఆప్తులతో వైరం…

భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డితో బద్ధ శత్రుత్వాన్ని పెంచుకున్నారు. బంధుత్వం లేకపోయినా చిన్న నాటి నుంచి మామా అని పిలచే ఏవీతో వైరం ఆమెకు మంచి కంటే చెడు చేసిందనే చెప్పాలి. ఆస్తుల వివాదమే కారణమని చెబుతున్నప్పటికీ, ఆధిపత్య పోరు కోసమేనన్నది అఖిలప్రియను దగ్గర నుంచి చూసిన వాళ్లు చెబుతున్న విషయం. ఏవీతో వైరం చివరకు హత్యలు చేసుకునే వరకూ వెళ్లింది.ఇక అఖిలప్రియ మేనమామ ఎస్.వి. జగన్ తోనూ వైరం పెట్టుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి విజయ డెయిరీ ఛైర్మన్ గా ఉన్నారు. ఆయనను ఆ పదవి నుంచి దించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎస్వీ కుటుంబం నుంచి కూడా ఆమెకు మద్దతు కొరవడినట్లయింది.

సొంత జిల్లా మంత్రులతోనే…

ఇక సొంత జిల్లాలోని టీడీపీ నేతలతోనూ ఆమెకు సఖ్యత లేదు. ఏకంగా మంత్రులతోనే అఖిలప్రియ విభేదాలు పెట్టుకున్నట్లే కనపడుతుంది. మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డిలు ఇద్దరూ అఖిలప్రియకు వ్యతిరేకంగానే ఉన్నట్లు కనపడుతుంది. ఆమె వ్యవహరిస్తున్న తీరును ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. వారితో కూర్చోవడం ఇష్టం లేక జడ్పీ సమీక్ష సమావేశానికి తనకు బదులు తన సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డిని పంపడం కూడా వివాదంగా మారింది. మొత్తం మీద అఖిలప్రియ ఏమనుకుంటున్నారో తెలియదు కానీ, నాలుగేళ్లు నా దే రాజ్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారంటే ఆమె పునరాలోచించుకోవడం మంచిదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these