తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం సంచలనంగా మారింది. ఇప్పటికే పలువురు సినీనటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలువురు పోలీసుల విచారణను ఎదుర్కొన్నారు. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్‌పైనా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.
‘ప్రస్తుతం నేను షూటింగ్ కోసం ఒక గ్రామానికి వచ్చాను. ఆన్లైన్ గేమింగ్ యాప్ కేసుల గురించి, నేను చేసిన యాడ్ గురించి చర్చ జరుగుతోందని ఇప్పుడే నాకు తెలిసింది. అందర్నీ ప్రశ్నించే నేను సమాధానం చెప్పాలి కాదా.. అలాంటి ప్రకటన ఎలా చేస్తారని అందరూ నన్ను ప్రశ్నిస్తున్నారు’ అని ప్రకాశ్ రాజ్ చెప్పారు.
‘2016లో ఆ యాడ్ నా దగ్గరకు వచ్చింది. ఆ యాడ్ చేసిన మాట నిజం. అది తప్పని కొద్ది నెలల్లోనే తెలుసుకున్నా. 2017లో నా అగ్రిమెంట్ పొడిగిస్తామని వాళ్లు అడిగితే.. ఆ యాడ్ తెలియక చేశాను. ఏడాది కోసం అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి, వెంటనే దాన్ని ఆపమని మీకు చెప్పలేకపోయా. ఇక ఆ యాడ్‌ను ప్రసారం చేయొద్దు. నేనూ నటించను’ అని చెప్పినట్లు ప్రకాశ్ రాజ్ వెల్లడించారు.
ఆ తర్వాత తాను ఏ గేమిం్ యాప్ లకు ప్రచారకర్తగా పనిచేయలేదని తెలిపారు. ‘2021లో ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేస్తే, ఏదో సోషల్ మీడియా వేదికలో నా ప్రకటన వాడారు. అందుకు వాళ్లకు లీగల్ నోటీసులు పంపాను. ఆ ప్రకటన తొలగించాలని వాట్సాప్ ద్వారా కూడా సంప్రదించాను. వెంటనే వాళ్లు ఆపేశారు. ఇప్పుడు మళ్లీ అది లీకైంది. అందువల్లే ఈ సమాధానం చెబుతున్నా. ఇప్పటి వరకూ పోలీస్ శాఖ నుంచి నాకు ఎలాంటి సందేశం రాలేదు’ అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. వస్తే వాళ్లకు వివరణ ఇస్తానని చెప్పారు.
ప్రజలకు ఇప్పుడు సమాధానం చెబుతున్నా. 9 ఏళ్ల కిందట అదీ, ఏడాది కాంట్రాక్ట్ కోసం పనిచేసిన మాట వాస్తవం. మళ్లీ ఆ యాడ్ చేయలేదన్నది నిజం. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. గేమింగ్ యాప్స్ ఒక వ్యసనం. యువత దీనికి దూరంగా ఉండండి. మీ జీవితం కోల్పోకండి అని ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు. కాగా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఆరోపణలతో ప్రకాశ్ రాజ్‌పై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ప్రకాశ్‌రాజ్‌కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.