ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా వైఎస్సార్ పేరుపై ఫోకస్ పెట్టింది. వైఎస్సార్ పేరుతో గతంలో ఉన్న స్థానిక సంస్థలు, జిల్లాల పేర్లలో మార్పులు చేసింది. దీనిపై పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంలో తన అన్న వైఎస్ జగన్ చేసిన ఓ మార్పును కూడా కూటమి సర్కార్ సవరించడంపై షర్మిల విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు తీరు చూస్తుంటే అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లుందని షర్మిల తెలిపారు.
అనాడు జగన్ చేసిన తప్పే నేడు చంద్రబాబు చేస్తున్నారని షర్మిల ఫైర్ అయ్యారు. అధికారంలో ఉండగా స్వర్గీయ ఎన్టీఆర్ పేరు మార్చి వైసీపీ ప్రభుత్వం అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మహానేత వైఎస్సార్ పేరు చెరిపి ప్రతీకారం తీర్చుకుంటుందన్నారు. కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను ఇది గాయపరిచిందన్నారు. వైఎస్సార్ జిల్లాను తిరిగి వైఎస్సార్ కడప జిల్లా పేరుతో సవరించడంలో అభ్యంతరం లేకపోయినా.. కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్సార్ పేరును తీసేయడాన్ని (గతంలో ఈ పేరు జగన్ సర్కార్ పెట్టింది) ఖండిస్తున్నట్లు షర్మిల తెలిపారు.
వైఎస్సార్ అంటే ఎందుకింత కక్ష అని చంద్రబాబు ప్రభుత్వాన్ని షర్మిల ప్రశ్నించారు. వైఎస్సార్ జిల్లాలో తిరిగి కడప పేరు చేర్చినప్పుడు …విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాకు ఎన్టీఆర్ విజయవాడ అనో లేక..పాత కృష్ణ జిల్లాకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా పేరు ఎందుకు మార్చలేదు అని ప్రశ్నించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అని, దేశంలోనే సంక్షేమ పథకాలకు ఆద్యుడని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నేతని తెలిపారు.
ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు లాంటి ప్రజాకర్షక పథకాలకు రూపశిల్పి మహానేత వైఎస్సార్ అన్నారు. తెలుగు వారు తమ గుండెల్లో గుడి కట్టుకొని, ఇంట్లో దేవుడి ఫోటోల పక్కన వైఎస్సార్ ఫోటో పెట్టుకొని…పూజిస్తున్న గొప్ప నేతకు రాజకీయాలు ఆపాదించడం సరైంది కాదన్నారు. ఇది ఆయనకు ఇచ్చే గౌరవం అంతకన్నా కాదన్నారు. వైఎస్సార్ అనే పేరు ప్రజల ఆస్తి అని, ఆయన ఏ ఒక్కరి సొత్తు కాదని తెలిపారు. వైఎస్సార్ తెలుగు వారి సొత్తు అని గుర్తుచేశారు.