పొమ్మనలేక పొగ- గుంటూరు మేయర్ కావటి రాజీనామా…

పొమ్మనలేక పొగ- గుంటూరు మేయర్ కావటి రాజీనామా...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు పంపించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజీనామా చేయడానికి గల కారణాలను వెల్లడించారు.

కార్పొరేషన్‌లో తనకు తీవ్ర అవమానం ఎదురవుతోందని కావటి మనోహర్ నాయుడు అన్నారు. ఈ అవమానాలు, నిందలు, పరాభవాలను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎదుర్కొన్నటువంటి అవమానాలు, పరాభవాలు కార్పొరేషన్ చరిత్రలో ఏ మేయర్ గానీ, ఏ ఛైర్మన్ గానీ అనుభవించి ఉండరని వాపోయారు.

భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని కోరుకుంటోన్నానని మనోహర్ నాయుడు చెప్పారు. పార్టీ మార్పుపైనా మనోహర్ నాయుడు తేల్చి చెప్పారు. పార్టీ మారే ప్రసక్తే లేదని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎన్ని కష్టాలు పెట్టినా వైఎస్ జగన్‌తోనే ఉంటానని ప్రకటించారు.

2021లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ నుంచి మేయర్ కావటి మనోహర్ నాయుడు ఎన్నికయ్యారు. ఇంకో ఏడాద కాలం పాటు ఆయన ఆ పదవిలో కొనసాగాల్సి ఉంది. ఈలోపే ఆయన తప్పుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన రాజీనామాకు ప్రధాన కారణం- కార్పొరేషన్ స్టాండంగ్ కమిటీ వ్యవహారశైలేనని చెబుతున్నారు. కొందరు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం, జనసేన తీర్థం పుచ్చుకోవడం వల్ల స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు ఆ రెండు పార్టీలకే దక్కాయి. ఈ కమిటీకి మేయరే ఛైర్మన్‌గా వ్యవహరిస్తోన్నారని, ఆయినప్పటికీ- ఆయనకు సమాచారం ఇవ్వట్లేదని తెలుస్తోంది.

అదే సమయంలో ఈ నెల 17వ తేదీన స్టాండింగ్ కమిటీ సమావేశం జరుగబోతోంది. స్టాఇందులో కావటి మనోహర్ నాయుడిపై అవిశ్వాసం తీర్మానం సైతం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. స్టాండింగ్ కమిటీలో మెజారిటీ స్థానాలు లేకపోవడం వల్ల ఈ తీర్మానం నెగ్గడం లాంఛనప్రాయమేనని, అందుకే కావటి రాజీనామా చేశారని అంటున్నారు.

స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఈ సమావేశాన్ని ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలనే నిర్ణయాధికారం మనోహర్ నాయుడికే ఉంటుంది. ఆ ప్రొటోకాల్‌ను సైతం అధికారులు పాటించట్లేదని ఆయన చెప్పారు. తన ప్రమేయం లేకుండా స్టాండింగ్ కమిటీ సమావేశాలను ఏర్పాటు చేస్తోన్నారని పేర్కొన్నారు. కార్పొరేషన్‌లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these