జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జయకేతనం పేరుతో సభను ఏర్పాటుచేశారు. ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ సభలో పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. “2018లో పోరాట యాత్ర చేశాం, ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశాం, ఓడిపోయినా అడుగు ముందుకు వేశాం, మనం నిలబడ్డాం.. పార్టీని నిలబెట్టాం, మనన నిలబడ్డాం.. 4 దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం” అని అన్నారు. అలాగే గతంలో గొంతెత్తితే కేసులు పెట్టారు, నిర్బంధంలో ఉంచారు. నన్ను తిట్టని తిట్టు లేదు, చేయని కుట్ర లేదని అన్నారు.
అసెంబ్లీ గేట్‌ను కూడా తాకలేవని చెప్పారు, వందశాతం స్ట్రయిక్ రేట్‌తో ఘనవిజయం సాధించాం, ఇవాళ జయకేతనం ఎగరవేస్తున్నాం అని పవన్ పేర్కొన్నారు. అలాగే పార్టీ ఆవిర్భం గురించి మాట్లాడుతూ.. “జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థలం ఆంధ్రా, తెలంగాణ భూమి నాకు పునర్జన్మ ఇచ్చింది” అని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. “ఆడపడుచుల పోరాటస్ఫూర్తిని మరచిపోలేను, ప్రజల దృష్టిలో అందరి దృష్టిలో రాణి రుద్రమ్మలు, వీరనారి గుణ్ణమ్మలు జనసేన ఆడపడుచులు, అందరి క్షేమం కాంక్షించే సూర్య దేవుని లేలేత కిరణాలు, తేడావస్తే కాల్చి ఖతం చేసే లేజర్ టీమ్‌లు జనసేన వీర మహిళలు” అని పేర్కొన్నారు.