రాజకీయాలకు యనమల గుడ్ బై – కండీషన్స్ అప్లై..!!

రాజకీయాలకు యనమల గుడ్ బై - కండీషన్స్ అప్లై..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారుతోంది. కూటమిగా కొనసాగుతూనే సొంతంగా బలం పెంచుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా కూటమి అయిదు ఎమ్మెల్సీ స్థానాలకు మూడు పార్టీల నుంచి అభ్యర్ధులను ఖరారు చేసారు. అయిదుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం పదవీ విరమణ చేస్తున్న యనమల తన రాజకీయ భవిష్యత్ పైన స్పష్టత ఇచ్చారు. ఇప్పుడు యనమల రాజకీయ భవిష్యత్ పై చంద్రబాబు తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.

యనమల తాజా నిర్ణయం

టీడీపీ సీనియర్ నేత రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా ఉన్న యనమల మరి కొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో, యనమల భవిష్యత్ ఏంటనే చర్చ మొదలైంది. టీటీడీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న యనమల అనేక పదవులు నిర్వహించారు. ఆరు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండు సార్లు ఎమ్మెల్సీగా పని చేసారు. శాసనసభ స్పీకర్ గా, ఎన్టీఆర్ – చంద్రబాబు కేబినెట్లలో మంత్రిగానూ పని చేసారు. టీడీపీలో చంద్రబాబు సన్నిహిత నేతగా గుర్తింపు ఉన్న యనమల ఇప్పుడు రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.

తేల్చేసిన యనమల

యనమలకు ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ కాలేదు. ప్రస్తుతం యనమల కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా, వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు నుంచి ఎమ్మెల్యేగా, అల్లుడు మహేష్ ఏలూరు ఎంపీగా ఉన్నారు. తాజాగా ఎమ్మెల్సీల ఖరారు వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేసి కొత్తగా ఎవరికి అవకాశం ఇస్తుందీ యనమలకు వివరించారు. ఆ సమయంలోనే తనకు మండలిలో రెండు సార్లు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. మరో అవకాశం పైన ఆసక్తి లేదని వెల్లడించారు. 43 ఏళ్లుగా టీడీపీలో ఉన్న యనమల ఇప్పుడు రాజకీయంగా ఏం చేయబోతున్నా రనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

చంద్రబాబు నిర్ణయం పైనే

శాసనమండలి అవకాశం కంటే ముందే రాజ్యసభకు వెళ్లాలనుకున్నా సాధ్యపడలేదని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. 1982లో తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ టీడీపీనే అంటిపెట్టు కుని ఉన్నానని గుర్తు చేశారు. 1982 నాటితో పోల్చితే ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు ప్రమాద కరంగా మారాయన్నారు. కార్పొరేట్ల ప్రవేశంతో డబ్బున్న వారికే రాజకీయాలు అన్నట్లుగా మార్పు వచ్చిందని విమర్శించారు. రాజకీయాల్లోకి ఓసారి వస్తే ఇక వెనక్కి వెళ్లే మార్గం లేదని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. అయితే, అవకాశం వస్తే రాజ్యసభకు వెళ్తానని.. లేకుంటే రాజకీయ జీవితానికి ముగింపు పలికి విశ్రాంతి తీసుకుంటానని యనమల స్పష్టం చేసారు. మరి.. చంద్రబాబు ఇప్పుడు యనమలకు రాజ్యసభకు అవకాశం ఇస్తారా లేదా అనేది పార్టీలో ఆసక్తి కరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these