ఏపీలోని వైఎస్సార్ జిల్లా బద్వేలులో కాశీనాయన క్షేత్రంలో ఆలయ కూల్చివేత వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. తాజాగా ఈ గుడిని అటవీ శాఖ అధికారులు ఆక్రమణ పేరుతో కూల్చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన మంత్రి నారా లోకేష్.. అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా తానే స్వయంగా సొంత నిధులతో నిర్మించి ఇస్తానని హామీ కూడా ఇచ్చారు. అయితే అటవీశాఖ మంత్రి కూడా అయిన పవన్ కళ్యాణ్ మాత్రం దీనిపై మౌనంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ నేత మల్లాది విష్ణు ఇవాళ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. కాశీనాయన జ్యోతిక్షేత్రం ధ్వంసానికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఇది హిందూధర్మంపై జరిగిన దాడి అన్నారు. అటవీశాఖ ఈ కూల్చివేతలకు పాల్పడితే మంత్రి పవన్ మౌనంగా ఎందుకు ఉండిపోయారని ఆయన ప్రశ్నించారు. ఇదేనా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ? అని నిలదీశారు. పవన్ కు తెలియకుండానే అటవీశాఖ ఈ గుడి కూల్చివేతలకు పాల్పడిందా అని మల్లాది విష్ణు ప్రశ్నించారు.
పదిరోజులుగా పవన్ ఎందుకు ఈ వ్యవహారంపై స్పందించలేదని మల్లాది విష్ణు నిలదీశారు. హిందూధర్మంపై జరిగిన ఈ దాడి పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో హిందూధర్మానికి రక్షణ లేదని మల్లాది విష్ణు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఏం జరిగినా తక్షణం తెలుసుకునే సాంకేతికత ఉందని గొప్పగా చెప్పుకునే సీఎం చంద్రబాబుకు కాశీనాయన క్షేత్రాన్ని అటవీశాఖ అధికారులే ధ్వంసం చేస్తుంటే సమాచారం లేదని తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అన్నారు.
హిందువుల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహాన్ని చూసి మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ సాక్షిగా క్షమాపణలు చెప్పడమే కాదు, తన సొంత ఖర్చుతో తిరిగి ఆ నిర్మాణాలను చేపడతామని చెప్పడం రాజకీయం కాదా అని మల్లాది విష్ణు ప్రశ్నించారు. అటవీశాఖకు చెందిన మంత్రి పవన్ కళ్యాణ్ మౌనంగా ఉంటే, సంబంధం లేని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు.