వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నిప్పులు చెరిగారు. పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో ప్రసంగించిన ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ స్వశక్తితో ఎదిగిన నేత అని అన్నారు. జగన్ మాత్రం తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సభావేదికగా తన ఆవేదనను, ఆక్రోశాన్ని, రాజకీయ భవిష్యత్తును స్పష్టం చేస్తూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.
పిఠాపురం సాక్షిగా నిజాలే చెబుతా!
“పిఠాపురం సభ సాక్షిగా, ఇక్కడి అమ్మవారి సాక్షిగా అంతా నిజమే చెబుతా” అంటూ బాలినేని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రాజకీయాల్లోకి వచ్చాక తండ్రి ఆస్తిలో సగానికి పైగా పోగొట్టుకున్నానని, కానీ జగన్ మాత్రం తన ఆస్తులతో పాటు వియ్యంకుడి ఆస్తులను కూడా కాజేశారని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని, అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటపెడతానని అన్నారు.
వైఎస్సార్ రాజకీయ భిక్ష.. జగన్ మోసం!
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు రాజకీయ భిక్ష పెట్టారని, అందుకే నాలుగేళ్ల మంత్రి పదవిని వదులుకుని జగన్ వెంట నడిచానని బాలినేని గుర్తు చేశారు. అయితే జగన్‌కు అధికారం వచ్చాక తనకు మంత్రి పదవి ఇచ్చి మళ్లీ తీసేశారని, దానికి తాను బాధపడనని అన్నారు. “పవన్ కల్యాణ్ గురించి కౌన్సిలర్‌కి ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువని జగన్ అన్నారు. కానీ, ఫ్యాన్ పార్టీ అధినేత మాత్రం తన తండ్రి రాజశేఖర్ రెడ్డి దయతో సీఎం అయ్యారు” అంటూ ఎద్దేవా చేశారు.
పవన్ స్వయంకృషితో ఎదిగిన నాయకుడు!
పవన్ కల్యాణ్ స్వశక్తితో పైకి వచ్చిన నాయకుడని బాలినేని ప్రశంసించారు. పోసాని కృష్ణమురళీ, వల్లభనేని వంశీలను అరెస్టు చేస్తే జగన్ వెళ్లి పరామర్శించారని, కుటుంబ సభ్యులను తిడితే ఎవ్వరూ ఊరుకోరని అన్నారు. కూటమి ప్రభుత్వం ఆరు నెలలు ఓపిక పట్టిందని, అదే తాను అధికారంలో ఉంటే లాఠీతో కొట్టి లోపల వేసేవాడినని అన్నారు
అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలి!
వైసీపీ హయాంలో కోట్లకు కోట్లు తినేసిన నాయకులు ఉన్నారని, వారిపై కేసులు పెట్టాలని బాలినేని డిమాండ్ చేశారు. 2019-24 మధ్య అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, చివరకు తన మీదైనా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. తాను కూటమి మధ్య చిచ్చు పెట్టేందుకు జనసేనలో చేరానని కొందరు ప్రచారం చేశారని, కానీ పవన్ కల్యాణ్‌కు తలవంపులు తెచ్చే పని ఎప్పుడూ చేయనని స్పష్టం చేశారు.
జిల్లా పరిషత్ ఛైర్మన్‌తో సహా జనసేనలోకి!
అవకాశం ఇస్తే జిల్లాలోని జిల్లా పరిషత్ ఛైర్మన్‌తో సహా అందరినీ జనసేనలోకి తీసుకువస్తానని బాలినేని ప్రకటించారు. జనసేన కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడం సరికాదని, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలిసి ఎమ్మెల్యేలందరికీ దిశానిర్దేశం చేయాలని సూచించారు. జనసేన కార్యకర్తలకు రేషియో ప్రకారం పదవులు ఇవ్వకపోతే ఎన్నికల సమయంలో వారు ప్రశ్నిస్తారని, అప్పుడు వారి బాధ తెలుస్తుందని హెచ్చరించారు.
పవన్‌తో సినిమా నా చిరకాల కోరిక!
పవన్ కల్యాణ్‌తో సినిమా తీయాలనేది తన చిరకాల కోరిక అని, దాన్ని నెరవేర్చుకుంటానని బాలినేని అన్నారు. తాను వైసీపీని వీడుతానని ఎవరూ ఊహించలేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ తనను మంచివాడని అన్నారని గుర్తు చేసుకున్నారు. అప్పుడే జనసేనలో చేరకపోవడం తన దౌర్భాగ్యమని అన్నారు.