ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి అంటే ఇదేనేమో. వైసీపీలో ఓ వెలుగు వెలిగిన నేత , ఇప్పుడు తాను ఒకరిని ఉన్నానని గుర్తించండని అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఆ నేత మరెవరో కాదు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆయన ప్రస్తుతం జనసేన పార్టీలో కొనసాగుతున్నారు.ఆయన వైసీపీలో రాజకీయంగా ఓ వెలుగు వెలిగారనే విషయం తెలిసిందే.బాలినేని రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో మొదలైనప్పటికీ, వైఎస్ఆర్ అనుచరుడుగా ఆయన జగన్ వెంట నడిచారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఒంగొలు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి, జగన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
జగన్‌కు బాగా దగ్గరైన వ్యక్తుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఒకరు. తనకు కావాల్సిన పనులు ఆయన పట్టుబట్టి మరీ చేయించుకునే వారు. అయితే మంత్రివర్గ విస్తరణలో భాగంగా బాలినేని తన మంత్రి పదవిని కోల్పోయారు. అప్పటి నుంచి ఆయన వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. ఇక ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన కొద్ది రోజులకే ఆయన వైసీపీకి రాజీనామా చేసి, జనసేన పార్టీలో చేరారు.బాలినేని జనసేనలో ఎంట్రీ అంత ఈజీగా జరగలేదు. వైసీపీని కాదని ఎన్నో ఆశలతో జనసేనలో చేరిన బాలినేనికి అడుగడునా అవమానాలే ఎదురయ్యాయి. మొదట జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను ఒంగోలుకు రప్పించి… బలప్రదర్శన నిర్వహించి, అనుచరగణంతో ఆయన సమక్షంలో పార్టీలో చేరాలని బాలినేని భావించారు.
కేవలం బాలినేని ఒకర్ని మాత్రమే పార్టీలోకి రావాలని జనసేన అధినేత షరతులు విధించారు. చేసేది లేక నిరాడంబరంగా ఒక్కరే పార్టీలో చేరారు.బాలినేని జనసేనలో చేరినప్పటికీ ఆయనకు ఎటువంటి పార్టీ బాధ్యతలు అప్పగించలేదు.ఇక తాజాగా జరుగుతున్న జనసేన ఆవిర్భావ వేడుకల్లో కూడా బాలినేనికి ఘోర అవమానం ఎదురైంది. వేదికపై ఆయన ముందు వరుసలో కాకుండా వెనుక కూర్చోవడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఏమాత్రం రాజకీయ అనుభవం లేని నాయకులు వేదికపై ముందు వరుసలో కూర్చోగా, బాలినేని మాత్రం వారి వెనుక కూర్చోవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ సోషల్ మీడియా తమ గ్రూపుల్లో తెగ వైరల్ చేస్తోంది. ”జగనన్న గుండెల్లో సముచిత స్థానం వదిలేసి… అధికారం కోసం వెళ్లి ద్వితీయ శ్రేణి నాయకులతో కూర్చునావ్… ఆత్మాభిమానం ఇప్పుడు ఏం అయింది బాలినేని” అంటూ వైసీపీ శ్రేణులు ఆయన్ను ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.