ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలకు ఇటీవల ఈసీ నోటిఫికేషన్ వెలువరించింది. ఖాళీ అయిన ఐదు స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ వెలువరించగా.. ఐదుగురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నుంచి కావలి గ్రీష్మ, బీదా రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ నుంచి సోము వీర్రాజు, జనసేన నుంచి నాగబాబు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు స్థానాలకు ఐదుగురు మాత్రమే నామినేషన్లు వేసినట్లు రిటర్నింగ్ అధికారి ఆర్. వనితారాణి తెలిపారు. ఈ నేపథ్యంలో ఐదుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఎన్నికైన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
మరోవైపు మార్చి 10న టీడీపీ నుంచి కావలి గ్రీష్మ, బీదా రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు, బీజేపీ నుంచి సోము వీర్రాజు నామినేషన్లు వేయగా.. జనసేన పార్టీ అభ్యర్థి నాగబాబు అంతకుముందే నామినేషన్ దాఖలు చేశారు. వీరంతా ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ఫలితంగా టీడీపీకి ముగ్గురు, బీజేపీ, జనసేనలకు ఒక్కొక్క ఎమ్మెల్సీ స్థానం దక్కాయి. ఈ ఎన్నికలతో ఏపీ శాసన మండలిలో కూటమి పార్టీల బలం మరింత పెరిగింది.
మరోవైపు యనమల రామకృష్ణుడు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, అశోక్‌బాబు,పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. అలాగే వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన జంగా కృష్ణమూర్తి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆయన రాజీనామాతో 2024 మే 15 నుంచి ఆయన స్థానం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి పదో తేదీతో నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి 13 సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది. అయితే గడువు ముగిసేసరికి ఐదు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండటంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.