Amaravati: అమరావతిలో భూ కేటాయింపులపై క్లారిటీ ఇచ్చిన మంత్రుల కమిటీ!

Amaravati: అమరావతిలో భూ కేటాయింపులపై క్లారిటీ ఇచ్చిన మంత్రుల కమిటీ!

అమరావతిలోని సంస్థలకు భూమి కేటాయింపులకు సంబంధించి పాత విధానమే కొనసాగుతుందని మంత్రుల కమిటీ నిర్ణయించింది. 31 సంస్థలకు గతంలో చేసిన కేటాయింపులు కొనసాగుతాయి. రెండు సంస్థలకు కేటాయింపులు మార్చబడ్డాయి. 16 సంస్థలకు స్థలం, పరిధి మార్పులు జరిగాయి. CRDA అభివృద్ధి చేసిన ప్లాట్ల అమ్మకంతో రాజధాని నిర్మాణానికి నిధులు సమకూరుస్తారు. ఆసక్తి ఉన్నవారికి కేటాయింపులు ఉంటాయని స్పష్టత ఇవ్వబడింది.

అమరావతిలో సంస్థలకు భూ కేటాయింపులపై పాత పాలసీనే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది మంత్రుల కమిటీ. అమరావతిపై ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరికి కేటాయింపులు ఉంటాయని క్లారిటీ ఇచ్చింది. సీఆర్డీఏ అభివృద్ధి చేసిన ప్లాట్లు విక్రయించి రాజధానిని నిర్మిస్తామని మంత్రులు తెలిపారు. రాజధాని అమరావతిలో వేర్వేరు సంస్థలకు భూకేటాయింపులపై మంత్రి నారాయణ నేతృత్వంలో మంత్రుల కమిటీ సమావేశమైంది. పయ్యావుల కేశవ్‌, కొల్లు రవీంద్ర, టీజీ భరత్‌, కందుల దుర్గేశ్‌ సమావేశానికి హాజరయ్యారు. అమరావతి నిర్మాణంలో భాగంగా చేసే భూ కేటాయింపులపై గతంలో ఉన్న విధానాన్నే కొనసాగిస్తామని భేటీ అనంతరం మంత్రుల కమిటీ స్పష్టం చేసింది.

గతంలో 131 మందికి భూములు కేటాయించామని, ఇందులో 31 సంస్థలకు చేసిన కేటాయింపులను యధాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి నారాయణ. రెండు సంస్థలకు గతంలో కేటాయించినట్టు కాకుండా వేరే చోట ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 16 సంస్థలకు స్థలంతో పాటు పరిధిని మార్చామన్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారని మంత్రి నారాయణ గుర్తు చేశారు. 43 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామన్నారు.

మెజార్టీ నిధులను సీఆర్‌డీఏనే సమకూర్చుకునేలా ప్రాజెక్ట్‌ను డిజైన్ చేశామని మంత్రి పయ్యావుల కేశవ్‌ వెల్లడించారు. రాజధాని కట్టాలంటే లక్షల కోట్లు కావాలని గతంలో జగన్‌ అన్నారని.. తామిప్పుడేమైనా లక్షల కోట్లు ఖర్చు చేస్తామని అన్నామా అంటూ ప్రశ్నించారు. ఆసక్తి ఉన్న వాళ్లకు భూకేటాయింపులు ఉంటాయని క్లారిటీ ఇచ్చిన మంత్రుల కమిటీ, కంపెనీల నిర్మాణ పనులు ప్రారంభం చేయడానికి సిద్ధంగా లేని వాళ్ల కేటాయింపులు రద్దు చేస్తామని కూడా స్పష్టతనిచ్చింది. మొత్తానికి అమరావతిలో నిలిచిపోయిన పనులు త్వరలోనే ఊపందుకోనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these