నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. అధికారంలో ఉంది వైసీపీ కాదు.. కూటమి ప్రభుత్వం అంటూ హెచ్చరించారు మంత్రి లోకేష్. డిప్యూటీ సీఎం పవన్‌ను ఉద్దేశిస్తూ జగన్ కామెంట్ చేస్తూ.. దానికి కౌంటర్ ఇవ్వడమే కాకుండా సవాల్ కూడా చేశారు మంత్రి లోకేష్. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ కేటాయింపులపై వైఎస్ జగన్ విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.. అదే సమయంలో పవన్ సహా కూటమి నేతలపై విమర్శలు చేశారు. జగన్ మాట్లాడిన కొన్ని గంటలకే కౌంటర్ ఇచ్చారు మంత్రి లోకేష్. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించిన జగన్.. ఇప్పడు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు మంత్రి లోకేష్.
మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్.. అదే మద్యాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచుకున్నారని లోకేష్ ఆరోపించారు. మద్యంలో అవినీతి చేయలేదని ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు మంత్రి లోకేష్.
11 సీట్లు ఎందుకు వచ్చాయో ఆత్మ పరిశీలన చేసుకోవాలి
అహంకారానికి ప్యాంటు, షర్టు వేస్తే జగన్ లాగే ఉంటుందన్నారు మంత్రి లోకేష్. డిప్యూటీ సీఎం పవన్‌ను కించపరిచేలా మాట్లాడారంటూ జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి అలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పవన్ కల్యాణ్‌కు ఎన్ని సీట్లు వచ్చాయో.. జగన్‌కు ఎన్ని వచ్చాయో తెలుసుకోవాలన్నారు. 11 సీట్లు ఎందుకు వచ్చాయో ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. తల్లి, చెల్లి కూడా నమ్మట్లేదని జగన్ ఇంకా గ్రహించట్లేదంటూ పేర్కొన్నారు.
జగన్‌కి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ప్రజలే నిర్ణయించారు
ఇక ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదంటూ జగన్ విమర్శలు చేయడంపైనా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. జగన్‌కి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ప్రజలే నిర్ణయించారు. ఆ విషయం జగన్‌కు ఎందుకు అర్థంకావడంలేదని ప్రశ్నించారు. చట్టాల్ని ఉల్లంఘించి ప్రతిపక్షహోదా ఇవ్వాలని జగన్ కోరుతున్నారు. కానీ తమ ప్రభుత్వం చట్టబద్ధంగా నడుచుకుంటుందన్నారు. టీచర్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి గెలిచారని జగన్ ఆరోపిస్తే.. బెంగళూరులో ఉన్న జగన్‌కు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా అని మంత్రి లోకేష్ నిలదీశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలతో పాటు పారిశ్రామిక వేత్తల్లో విశ్వాసం ఉందన్నారు.