శేషాచలం అటవీ ప్రాంతం. ఈ అడవి ఎన్నో జంతు జాతులకే కాదు అరుదైన వృక్ష సంపదకు నిలయం. మరెన్నో సర్ప జాతులు, విష సర్పాలు ఉన్న బయో స్పియర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో తరచూ భక్తులకు దర్శనమిస్తున్న పాములు బుసలు కొడుతున్నాయి. తిరుమలలోనే కాకుండా తరచూ తిరుమల నడక మార్గాల్లోనూ భక్తులకు కనిపిస్తున్న విష సర్పాల నుంచి ఇప్పటి దాకా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగక పోయినా పాములు మాత్రం భక్తులను బెదరగొడు తున్నాయి.
తిరుమల వెంకన్న దర్శనం కోసం కొండకు వచ్చిన భక్తులకు బుధవారం మూడు చోట్ల పాములు దర్శనమిచ్చాయి. అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం వద్ద షాప్ నెంబర్ 2లో ఆరడుగుల నాగు పాము బుసలు కొట్టడాన్ని భక్తులు స్థానికులు గమనించారు. మరోవైపు అక్కడే ఉన్న టీటీడీకి చెందిన ఎలక్ట్రిషన్ రూమ్ లోనూ మరో 6 అడుగుల జెర్రిపోతు కంటపడింది. ఈ రెండు పాములను గుర్తించిన భక్తులు, దుకాణదారులు స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం ఇచ్చారు.
వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన రెండు పాములను బంధించాడు. ఈలోపే మరో పాము భక్తుల కంటపడింది. తిరుమల సేవా సదన్ పక్కనే ఉన్న కళ్యాణ వేదిక వద్ద ఆరు ఆడుగుల నాగుపామును గుర్తించిన భక్తులు టీటీడీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు సేఫ్ గా ఆ పామును కూడ ఆపట్టుకున్నాడు. మూడు పాములను శేషాచలం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.