కోడికత్తికి ఎక్కువ.. గొడ్డలికి తక్కువ.. జనసేన సంచలన వ్యాఖ్యలు…నాదెండ్ల మనోహర్

కోడికత్తికి ఎక్కువ.. గొడ్డలికి తక్కువ.. జనసేన సంచలన వ్యాఖ్యలు...నాదెండ్ల మనోహర్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ తరుఫున మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. వైఎస్ జగన్ ఇష్టానుసారం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. వైనాట్ 175 కాస్తా 11కు పడిపోవటంతోనే వైఎస్ జగన్‌కి మతిభ్రమించిందని నాదెండ్ల మనోహర్ విమర్శించారు, జర్మనీ చట్టాలను ఏపీలో అమలు చేస్తానంటే ఎలా అంటూ సెటైర్లు వేశారు. జగన్‍లాగా తాము ఆరోపణలు చేయలేక కాదన్న మంత్రి నాదెండ్ల మనోహర్, కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని తామూ అనగలమని.. కానీ సభ్యత ఉంది కనుక ఆలోచిస్తున్నామంటూ కౌంటరిచ్చారు. నోరు ఉంది కదా అని ఏదిపడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

వైఎస్ జగన్ వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యే అంటూ నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాక, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు వెళ్లి పనులు చేసుకుంటారన్న నాదెండ్ల మనోహర్.. వైఎస్ జగన్ మాత్రం అసెంబ్లీకి రారని, నియోజకవర్గంలో ఉండరని ఎద్దేవా చేశారు. ఎప్పుడూ బెంగళూరులో ఉండే వైఎస్ జగన్.. నియోజకవర్గం ప్రజా సమస్యలపై ఎలా నిలబడతారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌ను ప్రత్యేకంగా టార్గెట్ చేసుకోవడం వెనుక.. జగన్ రాజకీయ కారణాలు ఉన్నాయన్నారు. తామూ కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అనగలమని.. కానీ ప్రజాస్వామ్యంలో పద్ధతి ప్రకారం మాట్లాడాలని హితవు పలికారు. కించపరిచేలా మాట్లాడితే ఓట్లు పడతాయనుకుంటే అది మీ భ్రమేనని విమర్శించారు.

మరోవైపు తాడేపల్లిలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ ఐదేళ్లలో సీట్ల ప్రకారం వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని.. ఓట్ల శాతం ప్రకారం కావాలంటే జర్మనీకి వెళ్లాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ వ్యా్ఖ్యలపై స్పందించారు. పవన్ కల్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. జీవితంలో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారని జగన్ సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ వ్యాఖ్యలపై జనసేన, టీడీపీ పార్టీలు మండిపడుతున్నాయి. మంత్రులు నాదెండ్ల మనోహర్, నారా లోకేష్.. జగన్ వ్యాఖ్యలను ఖండించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these