వైసీపీ నేత అంబటికి బిగ్ షాక్.. ఆ అనుమతులన్ని నిలిపివేత, ఈసారి రంగంలోకి కేంద్రం

వైసీపీ నేత అంబటికి బిగ్ షాక్.. ఆ అనుమతులన్ని నిలిపివేత, ఈసారి రంగంలోకి కేంద్రం

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళీకృష్ణకు మరో ఎదురు దెబ్బ తగిలింది. అంబటికి చెందిన గుంటూరులోని గ్రీన్‌గ్రేస్‌ అపార్టుమెంట్‌కు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ షాకిచ్చింది. ఈ అపార్ట్‌మెంట్ నిర్మాణానికి గతంలో ఇచ్చిన పర్యావరణ అనుమతులను నిలిపివేసింది. గత నెల 27న కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు ఈ అపార్ట్‌మెంట్‌కు అనుమతి లేదని చెప్పిన సంగతి తెలిసిందే.

ఇటీవల ఈ అపార్ట్‌మెంట్‌కు సంబంధించి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సాఫ్ట్ ఆర్డర్‌ను ధిక్కరించారు.. ఓ ఫ్లాట్‌ పనులు పూర్తిచేసి గృహప్రవేశం చేయడం వివాదమైంది. ఈ క్రమంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేన్ కమిషనర్‌ పులి శ్రీనివాసులు ఈ నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకోవాలని నివేదికను ప్రభుత్వానికి పంపించారు. అయితే ఇంతలోనే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు రద్దు చేస్తూ ఉత్తర్వులివ్వడంతో ఎదురు దెబ్బ తగిలింది.

వాస్తవానికి 20 వేల చదరపు మీటర్లకు పైబడిన స్థలంలో ఏదైనా నిర్మాణం చేయాలంటే పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే నిబంధనలను అనుసరించి నిర్మాణం చేపడతామని.. మొక్కలు పెంచుతామని చెప్పాలి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వాటి అమలు తీరు ఎలా ఉందో చెప్పాలి.. కానీ ఆ వివరాలేవీ వారికి పంపించలేదు. అలాగే పీసీబీ నుంచి సీటీఈ (కన్సెంట్‌ టు ఎస్టాబ్లిష్‌మెంట్) పొందకుండా నిర్మిస్తున్నారని నివేదిక వెళ్లింది. ఈ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు వచ్చిన అనంతరం పీసీబీ నుంచి సీటీఈ తీసుకుని పనులు ప్రారంభించాలి. కానీ అదేం లేకుండా నిర్మాణం చేపట్టడాన్ని ఉల్లంఘనగా భావించి అనుమతులు రద్దు చేశారు.

మాజీమంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళీకృష్ణకు చెందిన గ్రీన్‌గ్రేస్‌ అపార్ట్‌మెంట్‌‌కు సంబంధించి కొన్ని ఆరోపణలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా భవనాలను నిర్మించారని అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది.. అనంతరం క్రిమినల్‌ కేసు నమోదుకు కమిషనర్ ఆదేశించిన తర్వాత అపార్టుమెంట్‌ను నగరపాలక సంస్థ కమిషనర్‌ పరిశీలించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అన్ని అంశాలు పరిశీలించాక తుది నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ అన్నారు. అయితే వివాదం కొనసాగుతుండగానే.. గ్రీన్‌ గ్రేస్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఓ ప్లాట్‌ యజమాని గుట్టుగా గృహప్రవేశం చేయడం వివాదంగా మారింది. గృహ ప్రవేశం విషయం కమిషనర్‌‌కు తెలియడంతో దీనిపై కమిటీ ఏర్పాటు చేశారు. పరిశీలన చేసి నిర్లక్ష్యానికి బాధ్యులెవరో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సీపీ నుంచి ఇద్దరు, ముగ్గురు అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇంతలో ఈ అనుమతుల్ని నిలిపివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these